యాచారం, సెప్టెంబర్ 6 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆ ఊరి ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఒకప్పుడు అనేక సమస్యలకు నిలయంగా ఉన్న ఆ ఊరు ప్రస్తుతం అన్ని రంగాల్లో దశలవారీగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. మండలంలోనే మేజర్ గ్రామపంచాయతీ. పల్లె ప్రగతితో మిగతా పంచాయతీలకు నందివనపర్తి ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో ఎటు చూసినా ఆహ్లాదాన్ని పంచుతూ ఆకట్టుకునే హరితహారం మొక్కలు. మొక్కల పెంపకం కోసం ఏర్పాటు చేసిన నర్సరీ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు పల్లె ప్రకృతివనం, స్మృతివనం, బృహత్ పల్లె ప్రకృతివనం, కేసీఆర్ పుట్టిన రోజున నాటిన కోటి వృక్షార్చన మొక్కలు, వీధుల్లో సీసీ రోడ్లు, ప్రధాన వీధుల్లో ఎల్ఈడీ బల్బులు, క్రీడామైదానం, వైకుంఠధామం, తడి,పొడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయడానికి డంపింగ్‌యార్డు, మిషన్ భగీరథ ట్యాంకులు, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు సరఫరా, భూగర్భ డ్రైనేజీ కాలువలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, దుకాణ సముదాయం కోసంమార్కెట్యార్డు షెడ్లు, తడి,పొడి చెత్త సేకరణ కోసం ట్రాక్టర్, మొక్కలకు నీరందించేందుకు నీటి ట్యాంకర్ ఇలా సకల సౌకర్యాలతో పంచాయతీ ప్రగతి బాటన పయనిస్తున్నది.
ఆహ్లాదాన్ని పంచే పల్లె ప్రకృతివనం
గ్రామంలో నాలుగు పల్లె ప్రకృతి వనాల ద్వారా మొత్తం సుమారు 4వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ వనాల్లో 22రకాలతో కూడిన మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రహరీ నిర్మించారు. వివిధ రకాల ఔషధ, పండ్ల, పూల మొక్కలను పెంచుతున్నారు.
5ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం
పర్యావరణ సమతుల్యత కోసం ఇప్పటికే హరితహారం ద్వారా విరివిగా మొక్కలు నాటడం, ప్రతి గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి మొక్కలు పెంచడంతో పాటుగా తాజాగా అటవీ శాతాన్ని పెంచడం కోసం బృహత్ పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేసి మొక్కలు నాటేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నందివనపర్తిలో 5ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసి 2,010మొక్కలను నాటారు.
రూ.10.10 లక్షలతో వైకుంఠధామం
గ్రామంలోని అన్ని కులాలు, మతాల వారు ఒకే చోట దహన సంస్కారాలు చేసేందుకు వీలుగా వైకుంఠధామాన్ని రూ. 10.10లక్షలతో నిర్మించారు. రెండు శ్మశాన వాటికలు, స్నానాల గదులు, మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ తదితర వసతులను ఏర్పాటు చేశారు.
జోరుగా క్రీడా మైదానం నిర్మాణ పనులు
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా మైదానాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్, ఖోఖో తదితర ఆటలు ఆడుకోవడానికి క్రీడామైదానం నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
అభివృద్ధిలో ఆదర్శం
నందివనపర్తి గ్రామం మండలంలోనే మేజర్ గ్రామపంచాయతీ, గ్రామానికి బొల్లిగుట్టతండా, రజినితండా, కొమ్మోనిబావి గ్రామాలు అనుబంధంగా ఉన్నాయి. గ్రామంలో రెండు పాడుబడిన పురాతన బావులు, శిథిలావస్థకు చేరిన 83 ఇండ్లను పూడ్చివేయడంతో పాటుగా రోడ్లకు ఇరువైపులా ఉన్న కలుపు మొక్కలు, చెట్ల పొదలను తొలగించారు. గుంతలను మట్టితో నింపి చదును చేశారు.
నర్సరీలో మొక్కల పెంపకం
మొక్కలు పెంచేందుకు ప్రత్యేక నర్సరినీ ఏర్పాటు చేశారు. నర్సరీలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. తీరొక్క రంగుల పూలు, పండ్లు, ఔషధ మొక్కల నారును నర్సరీలో ఏర్పాటు చేశారు.
కోటి వృక్షార్చనలో వెయ్యి మొక్కల పెంపకం
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చనలో భాగంగా గ్రామంలో ఉద్యమంలా అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఏకంగా సుమారు 1,000మొక్కలు నాటారు.
ఎటు చూసినా పచ్చదనమే..
పచ్చదనాన్ని పెంపొందించేందకు 65,420 మొక్కలను విరివిగా హరితహారం కార్యక్రమం ద్వారా నాటారు. గ్రామానికి చెందిన బీఎన్‌రెడ్డి ట్రస్టు చైర్మన్ బిలకంటి శేఖర్‌రెడ్డి సహకారంతో కావలి నుంచి పెద్ద సైజు మొక్కలను దిగుమతి చేసుకొని కేవలం గ్రామానికి నలుదిక్కులా ఉన్న రోడ్లకు ఇరువైపులా 1,150మొక్కలు నాటారు.
డంపింగ్‌యార్డు నిర్మాణం..
నందివనపర్తి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి రూ.2.35లక్షలతో డంపింగ్‌యార్డును నిర్మించారు. గ్రామంలో ఇప్పటికే తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఇండ్లల్లో పేరుకుపోయిన చెత్తను గ్రామపంచాయతీ టాక్టర్ ద్వారా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ కంపోస్టు ఎరువును తయారు చేస్తున్నారు.
ఇంటింటికీ రక్షిత తాగునీరు.
మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామంలోని ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరును సరఫరా చేస్తున్నారు. దీనికోసం నందివనపర్తితో పాటుగా బొల్లిగుట్ట, రజినితండాలతో కలుపుకొని మొత్తం 6ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులున్నాయి. ఇటివలే కొమ్మోనిబావిలో నూతనంగా ట్యాంకు నిర్మించారు. 970నల్లాల ద్వారా ఇంటింటికీసరిపడా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
ఉచితంగా ట్రాక్టర్‌ను అందజేసిన శేఖర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పల్లె ప్రగతిలో భాగంగా నందివనపర్తికి చెందిన బీఎన్‌రెడ్డి ట్రస్టు చైర్మన్ బిలకంటి శేఖర్‌రెడ్డి రూ.5లక్షలతో నూతన ట్రాక్టర్, 1.6లక్షలతో ట్యాంకర్‌ను ఉచితంగా గ్రామ పంచాయతీకి అందజేశాడు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ట్రాక్టర్‌ను ప్రారంభించి శేఖర్‌రెడ్డిని అభినందించారు.