షాద్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 4 : ఒకప్పుడు నలుగురు కూరగాయల వ్యాపారులతో ప్రారంభమైన షాద్‌నగర్ సంత నేడు వందలాది మంది వ్యాపారస్తులకు ఉపాధిని చూపిస్తున్నది. ప్రతి ఆదివారం జరిగే ఈ సంతలో వేలాది మంది సామాన్య ప్రజలు తమకు అవసరమయ్యే కూరగాయలతోపాటు వంట సామగ్రి, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేస్తుంటారు. వందల మంది చిరు వ్యాపారులు తమ జీవనోపాధికి షాద్‌నగర్ సంతను కేంద్రంగా వాడుకుంటున్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల కొనుగోలుదారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి షాద్‌నగర్ సంతకు ప్రతి వారం విచ్చేస్తూ క్రయవిక్రయాలు జరుపుతుండడంతో ఆదివారం షాద్‌నగర్‌లో సంత సందడి జోరుగా కొనసాగుతుంది. గతంలో మున్సిపాలిటీలోని గంజ్‌రోడ్డు, కాలేజీ రోడ్డులో ఇరుకుగా ఉండే రోడ్లపై సంత వ్యాపారం చేసేవారు. దీంతో ఆదివారం వచ్చిందంటే చాలు పాదచారులు, ప్రయాణికులు ఇబ్బందిపడేవారు. సంత సందడిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు వినాయకగంజ్లో సంతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలో పలు చోట్ల సులభ్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేశారు. గతంలో సంత కోసం వచ్చే ప్రజల ఇబ్బందులను గుర్తించిన ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని మౌలిక వసతులను సమకూరుస్తుండడంతో వ్యాపారస్తులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంత చింత తీరింది:మల్లమ్మ, కూరగాయల వ్యాపారి, బాలానగర్
గతంలో గల్లీలో కూరగాయాలను విక్రయిస్తూ ఇబ్బందిపడ్డాం. ప్రస్తుతం సువిశాలమైన వినాయక గంజ్ వద్ద కూరగాయలను విక్రయిస్తున్నాను. ఎలాంటి సమస్య లేకుండా సంతోషంగా వ్యాపారం సాగిస్తున్నా.
వాహనాల తాకిడి ఎక్కువ: శేఖర్, టీఆర్ఎస్నాయకుడు, షాద్‌నగర్
వారాంతపు సంతకు వాహనాల తాకిడి అధికంగా ఉండేది. ఇరుకైన స్థలంలో కాకుండా మరోచోటుకు సంతను మార్చడంతో ట్రాఫిక్ సమస్య తీరింది.
ప్రత్యేక షెడ్లనుఏర్పాటు చేయాలి: గుణమల్లేశ్, షాద్‌నగర్
రోజురోజుకూ షాద్‌నగర్‌లో జనాభా పెరిగిపోతున్నది. అందుకే అదివారం సంత నాడు నిలువడానికి స్థలం లేకుండా పోతున్నది. చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేయాలి. దీంతో కొద్దిమేర ట్రాఫిక్ సమస్య తీరుతుంది.