రంగారెడ్డి, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం
పేదల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే డయాలసిస్, డయాగ్నోస్టిక్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నది. గతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేసుకోవాలంటే అధిక ఖర్చును భరించలేక ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. పేదల పరిస్థితిని చూసి ప్రభుత్వమే జిల్లా లో మూడు డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వాటి సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించింది. అంతేకాకుండా చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్న వారిపైనా దృష్టి సారించింది. పదేండ్ల క్రితం వరకు వెయ్యిమందిలో ఐదారుగురికిమాత్రమే బీపీ, షుగర్లాంటి వ్యాధులుండగా.. ప్రస్తుతం ప్రతి పదిమందిలో ఐదారుగురు బీపీ, షుగర్ వంటి రోగాలతో బాధపడుతున్నట్లు వైద్యారోగ్యశాఖ గుర్తించింది.
ఈ వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా.. మందులను క్రమం తప్పకుండా వేసుకోకుంటే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉన్నది. దీంతో ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకొని బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు గత మూడేండ్లుగా ఉచితంగా అవసరమైన మందులను అందిస్తున్నది. ఎన్సీడీ(నాన్-కమ్యూనికేబుల్ డిసీజ్-అసంక్రమిత వ్యాధులు) అనే కార్యక్రమం కింద బాధితులకు నెలకు ఒక్కొక్కరికి రూ. మూడు వేల చొప్పున ఖర్చు చేస్తూ బీపీ, షుగర్ మందులను పంపిణీ చేస్తున్నది. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేసేందుకోసం ఒక ఆశ వర్కర్‌ను కూడా నియమించింది. అయితే జిల్లాలో బీపీ బాధితులు 42,838 మంది ఉండగా, షుగర్ వ్యాధిగ్రస్తులు 23,164 మంది ఉన్నారు.
జిల్లాలో బీపీ, షుగర్ బాధితులు66,002
బీపీ, షుగర్ బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. జిల్లాలో 66,002 మంది బాధితులుండగా వారందరికీ జిల్లాలోని ప్రాథమిక కేంద్రాల ఆధ్వర్యంలో ఉచితంగా బీపీ, షుగర్ మందులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఎన్సీడీ కార్యక్రమం అమలు కోసం ప్రత్యేకంగా నియమించిన ఆశ వర్కర్లు ప్రతి మూడు నెలలకోసారి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని ఇంటింటికెళ్లి సర్వే చేసి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి బాధితుల వివరాలను జిల్లా ప్రోగ్రామ్ అధికారికి అం దజేస్తారు. వారు అందజేసిన డేటా ప్రకారం అన్ని పీహెచ్‌సీలకు బీపీ, షుగర్ మందులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు గత మూడేండ్లుగా సరఫరా చేస్తున్నారు. కాగా గతేడాది నుంచి ఆశ వర్కర్లు ఇంటింటికెళ్లి బాధితులకు నెలకు సరిపడా బీపీ, షుగర్ మందులను పంపిణీ చేస్తున్నారు.
అంతేకాకుం డా ఆ మందులను ఎలా వాడాలో వివరాలతో ఉన్న సమాచార కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు బీపీ, షుగర్ బాధితులకు ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్ లెవల్స్‌ను పరిశీలించే బాధ్యతను కూడా ప్రభుత్వం ఆశ వర్కర్లకే అప్పగించింది. 35 ఏండ్లు దాటిన వారికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయితేనే మందుల ను అందజేస్తున్నారు. ఒకవేళ బీపీ, షుగర్ లెవల్స్‌ను నియంత్రించే స్థాయి దాటిపోతే జిల్లా దవాఖానలకు బాధితులను పంపించి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. మొదట్లో బీపీ, షుగర్ పరీక్షలతోపాటు మందులను తీసుకునేందుకు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండగా ప్రస్తుతం చాలా మంది బాధితులు ప్రభుత్వం అందించే ఉచిత మందులను వాడుతున్నారు.
ఇంటింటికెళ్లి మందులు అందజేత
జిల్లాలోని బీపీ, షుగర్ బాధితులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇంటింటికెళ్లి అందజేస్తు న్నాం. ప్రతి మూడు నెలల కొకసారి ఆశ వర్కర్లు ఇంటింటికెళ్లి సర్వే నిర్వహించడంతోపాటు బీపీ, షుగర్ లెవల్స్‌ను పరిశీలిం చి ఉన్నతాధికారులకు వివరాలను అందిస్తున్నారు. వారి డేటా ప్రకారం జిల్లాలో ఉన్న బాధితులకు అవసరమైన మందులను పీహెచ్‌సీలకు సరఫరా చేస్తున్నాం.
-స్వరాజ్యలక్ష్మి, రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి