చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 3: ప్రభుత్వ పాఠశాలలంటే సరిగ్గా బోధన ఉండదు.. ఉపాధ్యాయులు సమయానికి రారు.. వసతులు సరిగ్గా ఉండవు.. నిధులు అంతంత మాత్రం అనే భావ న ఒకప్పటి మాట. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం విద్యావ్యవస్థలో వచ్చిన మా ర్పులతో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిన పాఠశాలల్లో ఊహించని రీతిలో ఫలితాలు వస్తున్నాయి. పచ్చదనం, పాఠశాలల పరిసరాల శుభ్రత, మరుగుదొడ్లు, విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత తదితర అంశాల్లో పలు పాఠశాలలు ముందున్నాయి.
పారిశుధ్య నిర్వహణలో ముం దున్న పాఠశాలలకు కేంద్ర సర్కారు ‘స్వచ్ఛ విద్యాలయ్’ పేరిట పురస్కారాలను అందిస్తున్నది. కాగా 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారానికి కందవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎం పికైంది.
జిల్లా నుంచి ఎంపికైన ఏకైక పాఠశాల ఇదే కావడంతో విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో ఈ పురస్కారంతోపాటు నగదు బహు మతిని కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందుకోనున్నారు.
పాఠశాల స్థాయిలో పరిసరాల శుభ్రతపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ పేరిట కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారాలను 2016 నుంచి అందిస్తూ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పోటీ పడ గా 59 అంశాలను పరిగణలోకి తీసుకొని పురస్కారానికి ఎంపిక చేస్తారు.
వారంలో ఒక రోజు పాఠశాల ఆవరణను శుభ్రం చేయడం, వ్యక్తిగత శుభ్రత, మధ్యాహ్న భోజన సమయంలో చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవడం, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవడం, కొవిడ్-19 జాగ్రత్తలు, ప్రవర్తనలో మా ర్పు, ఆచరణ వంటి అంశాలను రాష్ట్ర స్థాయి బృందాలు పాఠశాలల్లో తనిఖీలు చేశాయి. ఈ అంశాల్లో ప్రతిభ చూపిన పాఠశాలలను స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారానికి ఎంపిక చేశాయి. కందవాడ ప్రాథమిక పాఠశాల అన్ని అంశాల్లో ప్రతిభ చూపింది.
పారిశుధ్య నిర్వహణలో భాగంగా 76 మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తూ ఉపాధ్యాయు లు అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ నివారణలో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతిరోజూ చేతులను శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేశా రు. దీంతో స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారానికి ఎంపిక చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మా పాఠశాల రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారానికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో ప్రధానోపాధ్యాయుడు నరేంద్ర బోగం, ఉపాధ్యాయులు విజయ్‌కుమార్, రమణారెడ్డి కృషి ఎంతో ఉంది. కందవాడ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తా. బండ మరియమ్మ, ఎస్ఎంసీ చైర్మన్, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల కందవాడ
మా పాఠశాలలో ప్రతిరోజూ శుభ్రత కార్యక్రమాలను చేపడుతున్నాం. ప్రతి ఒక్కరం శుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నాం. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకుం టున్నాం. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం.
– జయశ్రీ, నాల్గోతరగతి విద్యార్థిని, కందవాడ
చదువుతోపాటు పరిసరాల శుభ్రత, స్వచ్ఛతపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉం చుతూ వ్యక్తిగత పరిశుభ్రతపైనా దృష్టి సారిస్తాం. వీటన్నింటి ఫలితమే మా పాఠశాలకు అవార్డు వరించింది. మా పాఠశాల స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారానికి ఎంపిక కావడం గర్వంగా ఉంది.
– బి.శివకుమార్, ఐదోతరగతి విద్యార్థి, కందవాడ
మేము చేసిన కృషికి తగిన గౌరవం దక్కింది. రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ్ పురస్కారానికి మా పాఠశాల ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయుల సమష్టి కృషి, దాతలు, స్థానికుల సహకారంతో స్వచ్ఛ పాఠశాలగా అభివృద్ధి చేశాం. విద్యార్థులు చదువుతోపాటు పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– నరేంద్ర బోగం, ప్రధానోపాధ్యాయుడు, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల కందవాడ