వారాంతపు సెలవుల్లో కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ఉత్సాహంగా బోటింగ్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ సిబ్బంది పర్యాటకులకు రక్షణ దుస్తువులు అందజేయడంతో పాటు బోటింగ్ చేసే విధానాన్ని తెలియజేస్తున్నారు. కుంటుంబ సమేతంగా వచ్చినవారు వనభోజనాలు చేసి సాయంత్రం వరకు ప్రాజెక్టు పరిసరాల అందాలను తిలకించి పరవశిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి అనంతగిరి, ధారూరు నుంచి వెళ్తే సమారుగా 23 కి.మీ, వికారాబాద్ నుంచి బుగ్గ రామలింగేశ్వర దేవాలయం, గడ్డమీది గంగారం గ్రామాల మీదుగా వెళ్తే సుమారు 18 కి.మీ దూరంలో ప్రాజెక్టు ఉన్నది.
ధారూరు, సెప్టెంబర్ 3 : వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టు జిల్లా కేంద్రానికి సుమారు 23 కి.మీ దూరంలో ఉంది. సెలవు దినాలు, శని, ఆదివారాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ప్రాజెక్టుకు తరలివస్తుంటారు. ముఖ్యంగా బోటింగ్ చేస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. రక్షణ దుస్తులు వేసుకుంటేనే బోటింగ్ చేసేందుకు సిబ్బంది అనుమతిస్తారు. ప్రాజెక్టు అందాలను కూడా తిలకించేందుకు ఉత్సాహం చూపిస్తారు. వర్షాలు తక్కువగా ఉండడంతో ప్రాజెక్టుకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. చుట్టుపక్కలవారే కాకుండా ఇతర ప్రాంతాలవారు కూడా వస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబసమేతంగా వచ్చి వన భోజనాలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతుంటారు.
కోట్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చే పర్యాటకుల కోసం బోటింగ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమారు 40మంది బోటింగ్ సిబ్బంది ఉన్నారు. వీరి పర్యవేక్షణలో సింగిల్ బోటింగ్ 6(ఒక్కరే బోటింగ్ చేసేది), డబుల్ బోటింగ్ 10 (ఇద్దరు బోటింగ్ చేసేది)లను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు నిర్వహిస్తారు. సింగిల్ బోటింగ్‌కు అరగంటకు(ఒక్కరికి) రూ.200, డబుల్ బోటింగ్‌కు ఇద్దరికి కలిపి రూ.300 తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ రక్షణ దుస్తులు(లైఫ్ జాకెట్స్) వేసుకున్న తర్వాతనే బోటింగ్‌కు అనుమతినిస్తారు.
కోట్‌పల్లి ప్రాజెక్టుకు వెళ్లేందుకు మార్గం
వికారాబాద్ నుంచి అనంతగిరి, ధారూరు నుంచి సుమారు 23 కి.మీ, వికారాబాద్ నుంచి బుగ్గ రామలింగేశ్వర ఆలయం, గడ్డమీది గంగారం గ్రామాల మీదుగా సుమారు 18కి.మీ దూరంలో ప్రాజెక్టు ఉంటుంది. ప్రాజెక్టుకు వెళ్ల్లడానికి బస్సు మార్గం లేదు. సొంత వాహనాల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ధారూరు నుంచి అటో ఎంగేజ్ చేసుకోని వెళ్లాలి. ప్రాజెక్టు మండల కేంద్రానికి సుమారు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
– స్వప్న, పర్యాటకురాలు, వరంగల్
కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ విధానం చాలా బాగుంది. అరగంట కాదు గంట సమయం ఇస్తే బాగుండేదని అనిపిస్తుంది. మేము దూర ప్రాంతం నుంచి వచ్చాం. కోట్‌పల్లి ప్రాజెక్టును చూడాలని చాలా రోజుల నుంచి అనుకున్నాం. ఉదయం నుంచి సాయంకాలం వరకు సమయం త్వరగా గడిచిపోయినట్లు ఉంది. వీలైతే మళ్లీ వేసవి కాలంలో రావడానికి ప్రయత్నం చేస్తాం. మా కుటుంబసమేతంగా వచ్చి వన భోజనాలు చేశాం.
– గోపాల్, పర్యాటకుడు, నాగారం
కోట్‌పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. అందులో దగ్గరగా ఉండటంతో సౌకర్యంగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచి శని, ఆదివారాలు, సెలవుల్లో ప్రాజెక్టుకు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.