పరిగి, సెప్టెంబర్ 3 : జిల్లాలోని గురుకులాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు నిర్వహించే స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల అధికారులు, జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ.. స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో భాగంగా ప్రతి గురుకులాన్ని పూర్తిస్థాయిలో స్వచ్ఛంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
ఇతర జిల్లాల్లో నిర్వహిస్తున్న గురుకులాలను జిల్లాకు తరలించేందుకు వీలుగా అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలను గుర్తించి మంగళవారం లోపు నివేదికలు ఇవ్వాలన్నారు. స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, ఉపాధ్యాయులతో కలిసి ఒక బృందంగా ఏర్పాటై కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గురుకులాల్లో పారిశుధ్య పనులు చేపట్టేందుకు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలన్నారు. చిన్నచిన్న మరమ్మతు పనులు చేపట్టేందుకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. సంక్షేమ వసతిగృహాల్లో కూడా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ నెల 5న చెత్త తొలగింపు, 6న పాఠశాల భవనం, పడక గదులు శుభ్రం చేయడం, 7న మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పారిశుధ్య ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీ, 8న పాఠశాలలోని వంటశాల, డైనింగ్ ప్రాంతాల్లో శుభ్రం చేయడం, 9న గురుకులాల పరిసరాల్లో మొక్కలతో సుందరీకరించడం, 10న సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 11న వారోత్సవాల ముగింపు కార్యక్రమం.
స్వచ్ఛ గురుకులాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛ గురుకులాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం గురుకుల పాఠశాలల విద్యార్థులు స్వయంగా రూపొందించిన మెమెంటోలు, ఛాయా చిత్రాలను కలెక్టర్‌కు అందజేశారు.
కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో అశోక్‌కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, డీఈవో రేణుకాదేవి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్, మైనార్టీల అభివృద్ధి అధికారి సుధారాణి, డీపీవో మల్లారెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ విమల, ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, పలు గురుకులాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.