సంకిరెడ్డిపల్లి, సంకిరెడ్డిపల్లి తండాల్లో తాగునీటికి కటకట
పట్టించుకోని గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు
సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో తీరిన అవస్థలు
తాండూరు రూరల్, మార్చి 14: మండలంలోని సంకిరెడ్డిపల్లి, దాని అనుబంధ గ్రామం సంకిరెడ్డిపల్లితండాలోని ప్రజలు 30 ఏండ్లుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారి ఇబ్బందులు మాత్రం తీరలేదు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లోనూ తీవ్ర తాగునీటి ఎద్దడిని అనుభవించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై మిషన్ భగీరథ పథకంతో ఈ రెండు గ్రామాలవాసుల తాగునీటి అవస్థలు తొలగిపోయాయి. ప్రతిరోజూ తాగునీటి సరఫరా జరుగుతుండటంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. గతంలో సంకిరెడ్డిపల్లి, సం కిరెడ్డిపల్లితండాలోని ప్రజలు ఎండాకాలం వచ్చిదంటే తాగేందుకు, వాడుకకు నీరు లేక అవస్థలు పడేవారు. తెల్లవారుజామున నిద్రలేచి వ్యవసాయ బావులు, కుంటల్లోకి వెళ్లి నీటిని తెచ్చుకునే వారు. పశువులకు కూడా నీటి కరువే.
దీంతో పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీటిని అందించలేక వాటిని ప్రజలు అమ్ముకునే వారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ముదిరితే ఆయా బావుల్లోని నీరు పూర్తిగా ఇంకిపోయేది. రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న పెద్దేముల్ మండలం, సిద్ధమడుగుతండాలోని ఓ చిన్నవాగుకు నడుచుకుంటూ వెళ్లి తాగేందుకు నీటిని తెచ్చుకునే వారు. సిద్ధ్దన్నమడుగుతండా సమీపంలోని వాగు ఎండలకు ఎండిపోతే అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించేవారు. ఈ గ్రామాలకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జినుగుర్తి గ్రామ సమీపంలోని వ్యవసాయ బావుల నుంచి నీటిని ట్యాం కర్ల ద్వారా తీసుకొచ్చి అధికారులు అందించేవారు.
మిషణ్ భగీరథతో సంపూర్ణంగా నీరు
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా సంకిరెడ్డిపల్లి, సంకిరెడ్డిపల్లితండాలో పుష్కలంగా తాగునీరు లభిస్తున్నది. సీఎం కేసీఆర్ సారూ మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి, మా పాలిట దేవుడిగా నిలిచారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నీటి ఘోష తప్పింది
మిషన్ భగీరథ పథకం ద్వారా సంకిరెడ్డిపల్లి, సంకిరెడ్డిపల్లి తండాలోని ప్రజలకు పుష్కలంగా తాగునీరు అందుతున్నది. 30 ఏండ్లుగా తాగునీటి గోసను అనుభవించాం. సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వాటి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. సంకిరెడ్డిపల్లి గ్రామంలో ముస్లిం, మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు ఉంటారు.తండాలో ముస్లింలు, మైనార్టీలు, గిరిజనులు కూడా ఉంటారు.మిషన్ భగీరథ పథకంతో రెండు గ్రామాల ప్రజలకు నీటి ఘోష తప్పింది.
–అమృత్రెడ్డి, సంకిరెడ్డిపల్లి సర్పంచ్