ఆమనగల్లు, సెప్టెంబర్ 3 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేపట్టిన పనులను ఎంపీ, ఎమ్మెల్యే, అధికారులకు సమాచారం ఇవ్వకుండా, ఏ విధమైన హోదా లేని వ్యక్తి ఎలా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ప్రశ్నించారు. శనివారం ఆమనగల్లు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట గిరి యాదవ్‌తో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
రోడ్డు డివైడర్, బారికేడ్ల నిర్మాణం, సెంట్రల్ లైట్లను ఏర్పాట్ల తదితర పనులను ఆయా శాఖలు పూర్తి చేసి పురపాలక శాఖకు అప్పగించిన తర్వాత జాతీయ రహదారుల శాఖ, విద్యుత్, పురపాలక సంఘం శాఖలు సంయుక్తంగా ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. పనులు పూర్తి కాకముందే స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా ఏ హోదా లేని వ్యక్తి ఆచారి ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
మాడ్గుల మండలంలో ఇద్దరు మహిళలు శస్త్ర చికిత్స వికటించి మృతి చెందడం బాధాకరమన్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించామని, ఇంకా పెంచుతామని అన్నారు. మహిళలను పరామర్శించడానికి వెళ్లితే రాళ్లతో దాడులు చేయాలని ప్రజలను రెచ్చగొట్టడం మానుకోవాలని, లేకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, దమ్ముంటే అడ్డుకోవాలని ఆచారీకి సవాల్ విసిరారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, శ్యామ్‌సుందర్, పత్యానాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్‌గౌడ్, జయరాం, రమేశ్, కిరణ్, సతీశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.