బొంరాస్‌పేట, ఆగస్టు 30 : సర్కారు బడుల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆధార్ సహిత వేలిముద్ర విధానాన్ని(ఆధార్ బేస్డ్ అటెండెన్స్ సిస్టం-అబాస్) విద్యాశాఖ అమలు చేసింది. వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి బోధన, బోధనేతర సిబ్బంది హాజరు తీసుకునే ప్రక్రియ పునః ప్రారంభం కానున్నది. ప్రభుత్వం 2019-20 విద్యా సంవత్సరంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలులోకి తెచ్చింది. రెండేండ్ల కిందటే అన్ని జిల్లాలతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా ఈ విధానాన్ని అమలు చేసినా కరోనా వ్యాప్తి కారణంగా దీని అమలును నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా తగ్గడంతో బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రెండేండ్ల కిందట పాఠశాలలకు పంపిణీ చేసిన బయోమెట్రిక్ యంత్రాలకు మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. హెచ్ఎంల ద్వారా యంత్రాలను ఎంఆర్సీ కార్యాలయాలకు తెప్పించి నిపుణులతో వాటిని బాగు చేయించారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి జిల్లాలోని జిల్లా, మండల పరిషత్, కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లోని బోధన బోధనేతర సిబ్బంది హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
అబాస్ యంత్రం పనిచేసే విధానం
అబాస్ యంత్రాన్ని పాఠశాలకు ఒకటి చొప్పున పంపిణీ చేశారు. వాటిలో ఉపాధ్యాయుడి పేరు, ఆధార్ సంఖ్యను నమోదు చేశారు. ఈ యంత్రం పాఠశాలలోనే పనిచేసేలా లొకేషన్‌ను గూగుల్ మ్యాప్‌లో నిక్షిప్తం చేశారు. వేలిముద్రతో ఉపాధ్యాయుడి పనివేళలను నమోదయ్యేలా యంత్రం పని చేస్తుంది. ఉపాధ్యాయుడు వేలిముద్ర వేసినప్పుడు ఆన్లైన్ విధానంలో సదరు ఉపాధ్యాయుడి హాజరు విద్యాశాఖకు చేరేలా అబాస్ యంత్రాన్ని రూపొందించారు. ఈ విధానం అమలు చేయడం ద్వారా ఉపాధ్యాయులు సమయ పాలన పాటించేలా దోహదపడుతుంది. ప్రతి ఉపాధ్యాయుడికి ఐడీ నంబరును ఇచ్చారు. ఈ నంబరును బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేసి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది.
జిల్లాలో పాఠశాలలు
వికారాబాద్ జిల్లాలో మొత్తం 1017 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 712, యూపీఎస్‌లు 115, ఉన్నత పాఠశాలలు 172, కేజీబీవీలు 18 ఉన్నాయి. వీటిలో 4060 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఒక్కో పాఠశాలకు ఒక్కో యంత్రం చొప్పున జిల్లాలోని 1017 పాఠశాలలకు 1017 బయోమెట్రిక్ యంత్రాలను అధికారులు అందజేశారు.
నాణ్యమైన విద్య అందించేందుకే..
జిల్లాలోని 1017 ప్రభుత్వ పాఠశాలల్లో సెప్టెంబరు 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ ద్వారా ఉపాధ్యాయుల హాజరును తీసుకోవడానికి విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో కరోనా కారణంగా ఈ విధానం నిలిచిపోయింది. మళ్లీ దీనిని పునః ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే యంత్రాలకు మరమ్మతులు చేయించాం. ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి కృషి చేయాలి.
-రవికుమార్, సెక్టోరియల్ అధికారి