కేశంపేటలో అధికంగా పత్తి, మొక్కజొన్న సాగు
లబ్ధి చేకూరుతుందంటున్న రైతన్నలు
కేశంపేట ఆగస్టు 30 : అన్నదాతలు సాగు చేసిన పంటలతో కేశంపేట మండలంలోని పల్లెలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. అన్నదాతలు ప్రతి సంవత్సరం ఎక్కువగా వాణిజ్య పంటలైన పత్తి, మొక్కజొన్నను సాగుచేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా మండల కేంద్రంతో పాటు సుందరాపురం, పాటిగడ్డల్లో కొందరు రైతులు 5 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తూ లాభాలను ఆర్జించడంతో పాటు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాకునూరు, వేములనర్వ, చౌలపల్లి, కొత్తపేట తదితర గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మండలంలో రైతులు పత్తి 8వేల ఎకరాలకు పైగా, మొక్కజొన్న 14వేల 500 ఎకరాలకు పైగా సాగు చేశారు. ఈ వర్షాకాలంలో పంటలకు అనుకూలంగా వర్షాలు సంవృద్ధిగా కురవడంతో రైతులు వేసిన పంటలు ఏపుగా పెరిగి పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గత సంవత్సరం పత్తి, మొక్కజొన్న పంటలకు సరైన ధర లభించడంతో ఈ సంవత్సరం కూడా అన్నదాతలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. షాద్నగర్ నియోజకవర్గంలో పత్తి, మొక్కజొన్న సాగులో కొందుర్గు, చౌదరిగూడెం మండలాల తరువాత కేశంపేట మండలానికి స్థానం ఉంది.
మద్దతు ధరతో లాభం
మా సుందరాపురం గ్రామంలో సుమారు 700 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. అందులో 70 శాతం రైతులు పత్తి పంటనే సాగు చేస్తారు. తరువాత మొక్కజొన్నకు ప్రాధాన్యతిస్తారు. పంటలకు అనుగుణంగా వర్షాలు కురిస్తే పత్తి, మొక్కజొన్న పంటల ద్వారా లాభాలు బాగానే వస్తాయి. నేను సాగు చేసిన 20 ఎకరాల పత్తి చేను బాగా వచ్చింది. మా పంటలకు ప్రభుత్వం మార్కెట్లో మద్దతు ధర కల్పిస్తే ప్రతిఫలం లభిస్తుంది. – బాసాని కస్పాల్రెడ్డి, రైతు, సుందరాపురం, కేశంపేట మండలం
30 ఎకరాల్లో పత్తి సాగు చేశా..
నాకున్న 5 ఎకరాలతో వ్యవసాయ పొలంతో పాటు మరో 25 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని 30 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశా. ప్రస్తుతం వర్షాలు బాగా కురవడంతో సాగు చేసిన పత్తి పంట చాలా బాగుంది. పత్తి చేను ఏపుగా పెరగడంతో చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి పోగా పత్తి పంట మంచి లాభాలను ఇస్తుందని ఆశిస్తున్నా.
– భవనం రాఘవారెడ్డి, రైతు సుందరాపురం, కేశంపేట మండలం