బొంరాస్‌పేట, ఆగస్టు 30 : జిల్లాలో చవితి పండుగ సందడి ప్రారంభమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రులను పురస్కరించుకుని వినాయక మండపాలు ముస్తాబవుతున్నాయి. వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు నగరం, పట్టణం, గ్రామం, తండా, గూడెం అన్న తేడా లేకుండా వాడవాడలా మండపాలను ఏర్పాటు చేసి వినాయకులను ప్రతిష్ఠించి పూజిస్తుంటారు. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు, యువత నిమగ్నమయ్యారు. గణనాథులను ప్రతిష్ఠించేందుకు ప్రతిమలను తరలిస్తున్నారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ), రసాయనాలు, వివిధ రకాల రంగులతో తయారుచేసిన ప్రతిమల కంటే మట్టితో చేసిన వినాయకులే శ్రేష్టమని వేద పండితులు, పర్యావరణ వేత్తలు, ప్రభుత్వాలు కొన్నేండ్ల నుంచి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వారు చేస్తున్న ప్రచారం, అవగాహన సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లాలోని చాలా చోట్ల పీవోపీ విగ్రహాల కంటే మట్టితో తయారుచేసిన గణనాథులను ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇళ్లలో కూడా మట్టి గణపతులను ప్రతిష్ఠించడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో ప్రమాదం
వినాయకులను తయారీకి ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నీటిలో కరుగదు. మట్టిలో కలువదు. దీనిలోని ముడి పదార్థం జిప్సం. చెరువులు, ఇతర నీటి వనరుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేస్తాం. అప్పుడు వీటిలో ఉండే హానికర రసాయనాలతో డయేరియా, చర్మవ్యాధులు సోకే ప్రమాదముంది. తగరంతో చర్మ వ్యాధులు వస్తాయి. చర్మం రంగు మారుతుంది. చర్మ క్యాన్సర్‌కు ఆస్కారం ఉంటుంది. ఆర్సానిక్ వల్ల తల వెంట్రుకలు ఊడిపోతాయి. సీసం వల్ల కడుపునొప్పి వస్తుంది. శరీర పటుత్వం తగ్గుతుంది. వ్యాధులు ప్రబలే అవకాశముంది. జలచరాలు, పశువులకూ ఆ నీటితో ముప్పే. ఆ నీటిని పొలాలకు మళ్లిస్తే భూసారం తగ్గి భూమి సహజత్వాన్ని కోల్పోతుంది.
మట్టితో తయారు చేసిన విగ్రహాలు అన్నింటికీ మేలు
మట్టితో తయారు చేసిన విగ్రహాలతో ఎలాంటి హానీ ఉండదు. నీటిలో నిమజ్జనం తరువాత విగ్రహాలు సులభంగా కరిగిపోతాయి. మట్టి వినాయకులను బంక మట్టితో తయారు చేస్తారు. ఎలాంటి రంగులు పూయరు. నీటి కాలుష్యం ఉండదు కాబట్టి మట్టి వినాయకులే అన్ని విధాలా శ్రేష్టమని పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
మట్టి వినాయకులను ప్రతిష్టిస్తే నజరానా..
మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజిస్తే బంగారు, వెండి నాణేలు బహుమతులుగా అందజేస్తానని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ప్రకటించి యువతను మట్టి వినాయకులవైపు ప్రోత్సహిస్తున్నారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లాలోని కులకచర్ల మండలం చాపలగూడెంలో స్వామి, గోపాల్ అనే ఇద్దరు వ్యక్తులు, ధారూరు మండలం అంపల్లెలో రాఘవేందర్ అనే వ్యక్తి కొన్నాళ్ల నుంచి మట్టి వినాయకులను సైజును బట్టి రూ.3 వేల నుంచి రూ. 10 వేల వరకు అమ్ముతున్నారు. కుమ్మరులు కూడా మట్టి వినాయకులను తయారుచేసి అమ్ముతున్నారు. పీవోపీ విగ్రహాల వల్ల కలిగే అనర్థాలను గ్రహించిన చాలా మంది ఇళ్లలో, కూడళ్లలో మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు.
మట్టి వినాయకుడినే ప్రతిష్ఠిస్తున్నాం- శ్రవణ్‌గౌడ్, బొంరాస్‌పేట ఎంపీటీసీ
పీవోసీతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, నీరు కలుషితమవుతుందని భావించి మేము ఆరేండ్ల నుంచి మట్టితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించి పూజిస్తున్నాం. మట్టి గణపతి ధర కూడా తక్కువ. అందరూ మట్టి గణపతులను పూజిస్తే పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం.
పూర్వీకుల నుంచి మట్టి వినాయకుడే..- ఉప్పు జగదీశ్వర్, బొంరాస్‌పేట
మా పూర్వీకుల నుంచి ఇంట్లో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించే ఆచారముంది. దీన్ని నేటికీ మేము ఆచరిస్తున్నాం. పీవోపీతో తయారు చేసిన విగ్రహాలు కలర్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నా పర్యావరణానికి హాని చేస్తాయని మట్టి గణపతులనే పూజిస్తున్నాం.