ఇబ్రహీంపట్నం, ఆగస్టు 30 : ఇబ్రహీంపట్నం సివిల్ దవాఖానలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నవారందరిని ముందస్తు వైద్యసేవల కోసం, వైద్యారోగ్యశాఖ అధికారులు నడుం బిగించారు. ఆపరేషన్ చేయించుకున్నవారిలో నలుగురు మృత్యువాత పడిన నేపథ్యంలో మిగిలినవారు ఎలాంటి అస్వస్థతకు గురికాకుండా వారందరిని మంగళవారం నగరంలోని అపోలో దవాఖానకు ఏడుగురిని, నిమ్స్ దవాఖానకు ముగ్గురిని, మితావారిని ఇబ్రహీంపట్నం సివిల్ దవాఖానకు తరలించారు. ఈ నెల 25న ఇబ్రహీంపట్నం సివిల్ దవాఖానలో 34మందికి డీపీఎల్ క్యాంపులో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఇందులో నలుగురు అస్వస్థతకు గురై మృత్యువాతకు గురయ్యారు.
ఇబ్రహీంపట్నం సివిల్ దవాఖానలో ఉన్నవారికి పలు రకాల పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి అస్వస్థత లేకున్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు వైద్యసేవలందించారు. రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి స్వరాజ్యలక్ష్మితోపాటు వైద్యబృందం ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానకు చేరుకున్నారు. దవాఖానకు తీసుకువచ్చిన వారికి స్కానింగ్‌లు, ఇతర పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని ముందస్తు వైద్య సేవల కోసం నగరంలోని నిమ్స్ దవాఖానకు తరలించారు. ఇంటికి వెళ్లాలనుకున్నవారికి ప్రతిరోజూ ప్రత్యేక బృందంతో వైద్యసేవలందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి ఉదయం నుంచి కావల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
సివిల్ దవాఖాన సందర్శన
సివిల్ దవాఖానలో కు.ని ఆపరేషన్లు చేయించుకొని చికిత్స పొందుతున్నవారిని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలందించాలని డాక్టర్ల బృందాన్ని ఆయన ఆదేశించారు. ప్రభుత్వపరంగా పూర్తిస్థాయిలో వైద్యసేవలందిస్తామని, ఎవరూ భయాందోళకు గురికావల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. దవాఖానలో చేరిన ప్రతి మహిళతో ఆయన మాట్లాడి భరోసా కల్పించారు. ఆయన పర్యవేక్షణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిపుణులైన వైద్యబృందం స్కానింగ్, ఇతరత్రా పరీక్షలు నిర్వహించారు.
సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం : వైద్యవిదాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్
ఇబ్రహీంపట్నం దవాఖానలో జరిగిన ఘటనపై నిపుణులైన వైద్యులతో కమిటీవేసి సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన దవాఖాన వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆపరేషన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఇబ్రహీంపట్నంలో ఈ సంఘటన జరుగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటన ఆపరేషన్ల లోపమా, లేక ఇతరత్రా ఏమైనా కారణాలున్నాయా అనేదానిపై విచారణ జరుపుతున్నామని, వారంరోజుల్లో పూర్తి నివేదిక వస్తుందని, నివేదికను ప్రభుత్వానికి అందజేసి తగిన చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ముందస్తుగా ఇతరత్రా సమస్యలు తలెత్తకుండా ఉండటానికి మెరుగైన వైద్యసేవల కోసం నగరంలోని నిమ్స్ దవాఖానకు తరలించామన్నారు.
కు.ని శస్త్ర చికిత్సలు విఫలమై ముగ్గురు మహిళలు మృతిచెందిన ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అక్టోబర్ పదో తేదీ నాటికి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని అస్వస్థతకు గురై మరణించిన సీతారాంపేటకు చెందిన లావణ్య కుటుంబానికి మంగళవారం తహసీల్దార్ రామ్మోహన్రావు రూ.5లక్షల పరిహారాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు అందించారు. అంతకుముందు లావణ్య మృతదేహంతో ఇబ్రహీంపట్నం-మంచాల రోడ్డులోని సీతారాంపేట గేటువద్ద ధర్నా నిర్వహించారు. వెంటనే తహసీల్దార్ అక్కడకు చేరుకుని చెక్కుతో పాటు వారి కుటుంబసభ్యులకు డబుల్బెడ్రూం ఇంటితో పాటు వారి పిల్లల చదువుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. టీఆర్ఎస్ గ్రామ నాయకుడు, ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్ టేకుల సుదర్శన్‌రెడ్డి లావణ్య కుటుంబానికి సొంత నిధులతో ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
ఎప్పటికప్పుడు ఆరా..
యాచారం మండలంలోని తులేఖుర్దుకు చెందిన మస్కు సరళ, యాచారంకు చెందిన పి.అశ్విని, కె.శ్రావణి, నందివనపర్తికి చెందిన టి.మమత, గున్‌గల్‌కు చెందిన దివ్వవాణి కు.ని ఆపరేషన్లు చేయించుకున్నారు. ఇందులో నలుగురిని ముందస్తు జాగ్రత్తగా కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశాల మేరకు అపొలో దవాఖానకు తరలించారు. తులేఖుర్దుకు చెందిన సరళ ఆరోగ్యంగా ఉండటంతో దవాఖానకు వెళ్లలేదు. యాచారం ప్రభుత్వ దవాఖాన హెచ్‌ఈవో శ్రీనివాస్ ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు.