పరిగి, ఆగస్టు 29: వికారాబాద్ జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కాలేజీకి 25 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను ప్రభుత్వం కేటాయించింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విష యం తెలిసిందే. ఇటీవలె జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కళాశాలకు పరిపాలన అనుమతులను జారీ చేయడంతోపాటు భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఈనెల 16న జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశా రు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎనిమిది మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. మెడికల్ కళాశాలకు అనుబంధ ఉన్న వికారాబాద్ దవాఖానను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులను జారీ చేసింది. కాగా మెడికల్ కళాశాల భవనాలను ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ. 235 కోట్లతో నిర్మించనుండటంతోపాటు 100 ఎంబీబీఎస్ సీట్లకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. మెడికల్ కళాశాలలో అవసరమైన అన్ని రకాల వైద్యయంత్ర పరికరాలు, ఇతర వసతులను టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వా రా సమకూర్చనున్నారు. మరోవైపు మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న వికారాబాద్ ప్రభుత్వ దవాఖానను తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో నుంచి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి బదిలీ చేశారు. దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
25 మంది రెసిడెంట్ డాక్టర్ల కేటాయింపు
వికారాబాద్‌లో ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీకి 25 మంది రెసిడెంట్ డాక్టర్లను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు కేటాయించారు. వారిలో 15 మంది ఇప్పటికే రిపోర్టు చేయగా మరో 10 మంది రెండు రోజుల్లో రిపోర్టు చేయనున్నారు. కేటాయించిన డాక్టర్లందరూ వివిధ రకాల వ్యాధులకు చికిత్స అందించే నిపుణులు. అందరూ స్పెషలిస్ట్ వైద్యులు కావడంతో మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యే వరకు వికారాబాద్ దవాఖానలో వారు తమ విధులను నిర్వహించనున్నారు. నిపుణులైన డాక్టర్ల సేవలు అందుబాటులోకి రానుండటంతో వికారాబాద్ ప్రజలకు మరిన్ని మెరుగైన, నాణ్యమైన, వివిధ రకాల వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి.
వికారాబాద్ ఏరియా దవాఖానను మెడికల్ కాలేజీకి అనుబంధ దవాఖానగా నిర్ణయించడంతో ప్రస్తుతం వికారాబాద్‌లో 100 పడకల దవాఖాన ఉండగా దానిని కూడా అప్‌గ్రేడ్ చేయనున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా 330 పడకల దవాఖాన ఉండాలి. అందుకు అనుగుణం గా వికారాబాద్ దవాఖానను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు మరిన్ని వసతులతో భవనాన్ని కూడా నిర్మించనున్నారు. దీంతో ప్రతిరోజూ మరింత ఎక్కువ మందికి వివిధ రకాల వైద్యసేవలను అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు వికారాబాద్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేయడంతో సాధ్యమైనంత త్వరగా కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. రానున్న ఏడాదిలో మెడికల్ కళాశాల అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఇప్పటికే 15 మంది డాక్టర్లు రిపోర్టు చేశారు
వికారాబాద్‌లో నూతనంగా ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీకి 25 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లను ప్రభుత్వం నియమించింది. వారిలో 15 మంది ఇప్పటికే రిపోర్టు చేయగా మిగతా వారు రెండు రోజుల్లో రిపోర్టు చేయనున్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటు వరకు వికారాబాద్ దవాఖానలో వారు తమ సేవలను అందిస్తారు. – డాక్టర్ ప్రదీప్‌కుమార్, డీసీహెచ్ఎస్, వికారాబాద్ జిల్లా