సిద్దిపేట, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మెదక్/సంగారెడ్డి నెట్వర్క్ : తెదళితబంధు పథకంపై కొందరు అపహాస్యపు, అహంకారపూరితంగా మాట్లాడడం సరికాదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన దళిత సంఘాలు, దళితబంధు లబ్ధిదారులు భగ్గుమంటున్నారు. పేదరికంలో మగ్గుతున్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకుని… ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం తీరును వక్రీకరించి మాట్లాడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపానపోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దళితబంధు అమలుతో ఆర్థికంగా నిలుదొక్కుకోగలుగుతున్నామని, చేతినిండా పని ఉండడంతో సంతోషంగా గడుపుతున్నామని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. దళితబంధును విమర్శిస్తే సహించేది లేదని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
లంగాణ ఉద్యమంలో వక్రబుద్ధి చూపిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా ఆయన తన పత్రికలో ఎప్పుడూ ద్వేషం కక్కుతూనే ఉంటాడు. తెలంగాణ మీద, టీఆర్ఎస్ సర్కారు మీద ఎప్పుడూ తన మీడియాలో నెగెటీవ్గానే స్పందిస్తుండడం ప్రజలందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణ సమాజం ఇంటి పత్రిక ‘నమస్తే తెలంగాణ’పై విషం కక్కుడే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఏబీఎన్ బిగ్ డిబెట్లో దళితబంధును వ్యతిరేకించడమే కాకుండా దళితబంధు పథకంపై ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడంపై ఆ వర్గాలు భగ్గుమంటున్నాయి. సంక్షేమ పథకాలు, ఉచితాలు ఎందుకు? ఒక కుటుంబానికి ఎలా రూ.పది లక్షలు ఇస్తారు? అంటూ తన కుసంస్కారాన్ని బయట పెట్టుకున్నారు. ఉచితాలకు ఓట్లు రాలుతాయా? అంటూ తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు.
అడ్డదిడ్డ వార్తలతో ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా ఇష్టానుసారంగా తన పత్రికల్లో రాసుకుంటూ, చానల్లో ప్రసారం చేయడంపై ఆ వర్గాలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవు.. ఇక్కడ అన్నివర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలు, మరే ఇతర రాష్ర్టాల్లో గానీ ఇలాంటి పథకాలు ఉన్నాయా అంటే? ఎక్కడా లేవు. ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలియదా? అన్నీ తెలిసి కూడా మరీ ఆయన ఎలా మాట్లాడతారు.. అంటూ దళిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఉచితాల గురించి మాట్లాడడం ఏమిటీ? పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వద్దా? పేద ప్రజల బాగుపడవద్ద్దా? ఎందుకు మీకు పేద ప్రజలపై అంత మంట? అంటూ ప్రజలు ఆయన తీరుపై మండిపడుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతికి కోసం దళితబంధు పథకం తీసుకొస్తే, దానికి ఆయన వంకరబుద్ధితో మాట్లాడడంపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశానికే ఆదర్శం …
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా దళితులను ఓటుబ్యాంకుగానే వాడుకున్నారు. దేశాన్ని ఇన్నేండ్లు ఏలిన రాజకీయ పార్టీలు వారి సంక్షేమానికి ఆశించిన స్థాయిలో కృషిచేయలేదు. అందువల్లనే దేశంలో దళితులు ఇప్పటికే ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనకబడి ఉన్నారు. వారి తరతరాల తలరాతను మార్చేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారు. ఇవాళ దేశానికి ఆదర్శంగా ఈ పథకం నిలిచింది. దళితబంధు పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి రూ.10లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ఇది పూర్తిగా గ్రాంట్. తిరిగి లబ్ధిదారులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. తొలివిడతగా సిద్దిపేట జిల్లాలో 495 మంది లబ్ధిదారులకు రూ.45.50 కోట్లతో 60 రకాల యూనిట్లను ప్రభుత్వం అందించి, ఆ కుటుంబాల్లో వెలుగులు నిం పింది.
మెదక్ జిల్లాలో 255 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం అందివ్వగా, ఇక్కడ రూ.25.50 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 444మందికి రూ. 44.40 కోట్లు అందించింది. ప్రభుత్వం అందించిన సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. లబ్ధిదారుల రక్షణ కోసం దళితనిధిని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన దళితబంధు పథకం ద్వారా లబ్ధిపొందిన కుటుంబాలు ఇవాళ సొంతకాళ్ల మీద నిలబడి, మరో పది మందికి ఉపాధిని చూపిస్తున్నాయి. ఈ పథకం దళితుల ఆర్థికాభివృద్ధితో పాటు ఆర్థిక, సామాజిక అసమానతలు తగ్గించడానికి దోహదపడుతున్నది. ప్రభుత్వం అందించిన ఈ పథకంతో తామంతా బాగుపడి, తమ కాళ్ల మీద తాము నిలబడి.. మరో పది మందికి ఉపాధినిచ్చేలా ఎదుగుతున్నా రు. దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశానికే స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రభుత్వం అందించిన చేయూత దళితబంధు లబ్ధిదారుల జీవన విధానాన్ని మార్చేసింది.
దళితుల వ్యతిరేకి ఏబీఎన్ రాధాకృష్ణ
గత ప్రభుత్వాలు దళితులను ఏమాత్రం పట్టించుకోలేదు. దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘దళితబంధు’ ప్రవేశపెట్టారు. దళితబంధు పథకంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ దళితుల వ్యతిరేకి. దళితులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. రాధాకృష్ణకు దళితులు త్వరలో బుద్ధి చెబుతారు.
-గరుగుల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ టీస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు