విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించేలా రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే త్రీఆర్స్ కార్యక్రమాన్ని అమల్లో తీసుకొచ్చి చదువడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలను విద్యార్థులకు నేర్పించారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఆరితేరేలా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15న తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల వరకు తెలుగు, ఇంగ్ల్లిష్, గణితం సబ్జెక్టులతోపాటు పరిసరాల పరిజ్ఞానంపై ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు మూడు విడుతల్లో శిక్షణ సైతం ఇచ్చారు. విద్యార్థులను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించి చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు ‘సీ’ గ్రేడ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులను దత్తత తీసుకుని అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా తీర్చిదిద్దనున్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 28, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో త్రీఆర్స్ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చి చదువడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలను విద్యార్థులకు నేర్పించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ప్రాథమిక దశ నుంచే ఆరితేరేలా ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులతోపాటు పరిసరాల పరిజ్ఞానంపై ప్రత్యేకంగా తరగతులను నిర్వహించనున్నారు. ముందుగా సంబంధిత సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఏ మేరకు పరిజ్ఞానం ఉందనేది తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల రెండో వారంలో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని బట్టి విద్యార్థులను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 22 వరకు గాంధీ సినిమా ప్రదర్శన కార్యక్రమం ఉండడంతో తొలిమెట్టు తరగతులను ఈ నెల 23 నుంచి ప్రారంభించారు.
సీ గ్రేడ్ విద్యార్థుల దత్తత
తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పరీక్షలో వెనుకబడిన విద్యార్థులపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించనుంది. సీ గ్రేడ్ విద్యార్థులు కూడా అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులను ఏ, బీ, సీ గ్రేడ్లుగా విభజించారు. సీ గ్రేడ్ విద్యార్థులకు సంబంధించి ఒక్కో ఉపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థులను దత్తత తీసుకోనున్నారు. వీరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. దత్తత తీసుకున్న విద్యార్థులు వరుసగా మూడు రోజులు రాకపోతే నాలుగో రోజు సంబంధిత విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడి స్కూల్‌కు వచ్చేలా ఉపాధ్యాయులు చూడనున్నారు.
ఉపాధ్యాయులకు మూడు విడుతల్లో శిక్షణ
వార్షిక, వార, పీరియడ్ ప్రణాళికలను రూపొందించి, తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభ్యాసనలో ఉన్న అంతరాల్ని తొలగించేందుకు ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్‌లను కూడా ప్రభుత్వం అందజేసింది. విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయులే ప్రతి వారం అసైన్మెంట్ పరీక్షలను నిర్వహించడంతోపాటు విద్యార్థుల ప్రగతిని నమోదు చేయనున్నారు. విద్యా సంవత్సరం చివరలో ఒక ఎండ్ లైన్ పరీక్ష నిర్వహించి అభ్యాసన స్థాయిలో ఏ రకమైన మార్పు వచ్చిందో గమనించనున్నారు. తొలిమెట్టుపై అవగాహన ఉండేలా జిల్లా విద్యాశాఖ అధికారి మొదలుకొని ఉపాధ్యాయుల వరకు అందరికీ ప్రభుత్వం శిక్షణనిచ్చింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు విడుతల్లో ప్రత్యేక శిక్షణనిచ్చారు. మొదటి విడుతలో 1337, రెండో విడుతలో 1327, మూడో విడుతలో 165 మంది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మరోవైపు తొలిమెట్టు కార్యక్రమాన్ని కాంప్లెక్స్ స్థాయిలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయిలో మండల విద్యాధికారి, సీనియర్ గెజిటెడ్ హెడ్మాస్టర్లు, జిల్లా స్థాయిలో సెక్టోరల్ అధికారులు పర్యవేక్షించనున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ ద్వారా విద్యార్థులు పట్టు సాధించినట్లయితే సంబంధిత స్కూళ్లు, ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేయనున్నారు.
తొలిమెట్టు తరగతులు షురూ
– సుశీందర్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి
తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాతో సహా సెక్టోరల్ అధికారులు, ఎంఈవోలు, ఉపాధ్యాయులకు తొలిమెట్టు కార్యక్రమంపై ప్రభుత్వం శిక్షణనిచ్చింది.