ఆదిబట్ల, ఆగస్టు 26 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదిగి అడవిని తలపిస్తున్నాయి. ఎటు చూసినా పచ్చని వనాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఆదిబట్ల పరిధి నుంచి కోహెడ వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు హెచ్ఎండీఏ, ఫారెస్ట్ అధికారులు కలిసి గతంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వృక్షాలయ్యాయి. ఔటర్ రింగు రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో మొక్కలు నాటారు. ప్రతి ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. వేసవిలో అక్కడక్కడ మొక్కలు ఎండి పోతే కొత్త మొక్కలను నాటారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురువడంతో మొక్కలు ఏపుగా పెరిగి పచ్చని వాతావరణం నెలకొన్నది. ఔటర్ రింగురోడ్డుపై నుంచి ప్రయాణిస్తున్న వాహనదారులు పచ్చని అందాలను ఆస్వాదిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పచ్చందాల బొంగ్లూరు జంక్షన్..
పచ్చని మొక్కలతో బొంగ్లూరు జంక్షన్ కళకళలాడుతున్నది. ఎటు చూసినా పార్కుల ఏర్పాటు… ఔటర్ రింగు రోడ్డుకు పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు పచ్చని రంగువేసినట్లుగా మారింది. వాహనదారులు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.