కులకచర్ల, ఆగస్టు 26 : ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న పల్లె.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతి కార్యక్రమంతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకుని ప్రగతి ముల్లెగా మారింది. నేడు చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది మండలంలోని సాల్వీడ్ గ్రామం. మండల కేంద్రానికి 6కిలో మీటర్ల దూరంలో ఉన్న సాల్వీడ్ గ్రామంలో సుమారు 600 కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో పనిని పూర్తి చేశారు. నిత్యం పంచాయతీ సిబ్బంది వీధులను శుభ్రం చేయడంతో పాటు కలుపుమొక్కలను తొలగిస్తుండడంతో పల్లెంతా శుభ్రంగా మారింది. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 100 శాతం మరుగుదొడ్లను నిర్మించారు. ఎవరైనా బహిర్భూమికి వెళితే రూ.500 జరిమానాను విధిస్తుండడంతో స్వచ్ఛ పల్లెగా మారింది. ప్రతి ఇంటి వద్ద ఇంకుడుగుంతను సైతం నిర్మించుకున్నారు. ప్రతి వీధిలో సీసీ రోడ్డుతో పాటు మురుగు కాల్వలను నిర్మించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణాలను పూర్తి చేశారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పచ్చని మొక్కలతో ఆకట్టుకుంటున్నది. హరితహారం కార్యక్రమ నిర్వహణకు గ్రామ నర్సరీలో మొక్కలు సరిపడా ఉన్నాయి. ఏటా మొక్కలు నాటడంతో పాటు ఎండిపోయిన మొక్కల స్థానంలో నూతన మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడంతో యువకులు క్రీడలపై ఆసక్తిని చూపుతున్నారు. నిత్యం పంచాయతీ ట్రాక్టర్‌తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసి హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. ప్రతి వీధిలో ఎల్ఈడీ బల్బులు వేయడంతో రాత్రి వేళల్లో పల్లె జిగేల్మంటున్నది.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి..
గ్రామస్తులు, గ్రామ పాలకుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. పల్లె ప్రగతితో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకున్నాం. వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనం, సీసీ రోడ్లు, మరుగుదొడ్లను నిర్మించాం.
– బాలయ్య, సాల్వీడ్ గ్రామ సర్పంచ్