షాబాద్, ఆగస్టు 26: ఈ వానాకాలం-2022 సీజన్లో సాగు చేసిన పంటల వివరాలను సర్వే నెంబర్ వారిగా ఈ నెలాఖరులోగా ఆన్లైన్లో నమోదు పూర్తి చేయాలని వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం డీడీఏ జ్యోతిర్మయి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చందనవెళ్లి, తాళ్లపల్లి, రేగడిదోస్వాడ గ్రామాల్లో పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంటలు సాగు చేసిన ప్రతి రైతులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వెంకటేశం, ఏఈవోలు రాఘవేందర్, గీత, రైతులు తదితరులున్నారు.
రైతులు పంటల నమోదు చేయించుకోవాలి
చేవెళ్ల రూరల్ : రైతులు పంటల నమోదును విధిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి తులసి తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో ఈవోలు నిర్వహిస్తున్న పంటల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ వరకు పంటల నమోదు ప్రక్రియకు చివరి తేదీ అని తెలిపారు. నమోదు చేయకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి నిరాకరిస్తారని తెలిపారు. రైతులు గ్రామాల్లోకి పంటల నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్న ఏఈవోలకు సహకరించి వివరాలు తెలుపాలన్నారు. ఏవో వెంట ఏఈవోలు రాజేశ్వర్రెడ్డి, బాలకృష్ణ, రైతులు ఉన్నారు.
ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
వానకాలం సీజన్లో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జ్యోతిర్మయి అన్నారు. అజీజ్నగర్, నక్కలపల్లి గ్రామాల్లో సాగు చేసిన పంటల వివరాల నమోదును పరిశీలించారు. ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేశారు, ఏయే పంటలు వేశారు, ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారనే విషయాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాగమ్మ, నక్కలపల్లి సర్పంచ్ స్వప్న, ఏఈవోలు కుమార్, సునీల్, రైతులు ఉన్నారు.