రంగారెడ్డి, ఆగస్టు 25, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా తెలంగాణకే బంగారు కొండ, రెండు ఎకరాలున్న రైతు పెద్ద కోటీశ్వరుడు… అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు కొంగరకలాన్‌లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ వద్దకు చేరుకోగా, జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలకగా, అర్చకులు పూర్ణ కుంభంతో సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, తర్వాత కొంగరకలాన్ సర్వే నంబర్ 300లోని 44 ఎకరాల్లో రూ.58 కోట్ల వ్యయంతో మూడంతస్తుల్లో, వందకుపైగా విశాలమైన గదులతో నిర్మించిన కలెక్టరేట్ సముదాయ శిలా ఫలకాన్ని సీఎం ఆవిష్కరించి, కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కలెక్టరేట్ భవన సముదాయం అంతటా సీఎం కలియతిరిగి, కలెక్టరేట్లో ఆదిత్యాత్మక రుద్ర పూజ చేశారు. తదనంతరం కలెక్టర్ చాంబర్‌లోని కూర్చీలో కలెక్టర్ డి.అమయ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ కూర్చోబెట్టి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో సీఎం పాల్గొనడంతోపాటు కలెక్టరేట్ నిర్మాణంలో భాగస్వాములైన వారిని సీఎం కండువాలతో సన్మానించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో రంగారెడ్డి జిల్లాలో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారు, ఇక్కడ భూముల ధరలు పడిపోతాయని, మనం దెబ్బతింటామని చెప్పారన్నారు. ఇలా చెప్పిన వాళ్లంతా కరెంట్, తాగునీళ్లు, పేదల సంక్షేమం చేయకుండా కంటితుడుపు చేసిన వారే మనల్ని గోల్మాల్ చేసే ప్రయత్నం చేశారన్నారు. కానీ ఈరోజు భూముల ధరలు కోట్లలో పెరిగాయని, రైతులు బాగుపడ్డారన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం దూసుకుపోయి 1.55 లక్షల మందికి ఉద్యోగాలొస్తే బెంగళూరులో ఉద్యోగాలు తగ్గాయన్నారు. తెలంగాణలో కూడా వచ్చే పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు తరలిపోవాలా, రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోవాల్నా, ఈరోజు రంగారెడ్డి తెలంగాణకే బంగారు కొండ, రెండు ఎకరాలున్న రంగారెడ్డి జిల్లా రైతు పెద్ద కోటీశ్వరుడు ఆ పరిస్థితి ఉండాలా, మతపిచ్చిగాళ్లు చిల్లర రాజకీయాల కోసం రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తే చూస్తు ఊరుకోవాలా అన్ని అన్నారు.
అదేవిధంగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రమంతా ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. శాంతియుత తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోవడంలో, తెలంగాణను ఆదర్శంగా ఉంచడంలో బుద్దిజీవులు, మేధావులు ముందుండాలని, అందులోనూ రంగారెడ్డి జిల్లా ప్రజలు చైతన్యవంతులు కాబట్టి మీరు ముందుండాలని సూచించారు. తాండూరు దాటితే పక్కనే కర్ణాటక రాష్ట్రం వస్తది ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి 500 మందిని తీసుకుపోయి అక్కడ చూపించండి, ఆ రాష్ట్రంలో కల్యాణలక్ష్మి లేదు, షాదీముబారక్ లేదు, రైతుబంధు, రైతుబీమా లేదు, మనం ఇన్నీ చేస్తున్నా మనపై కాలు దువ్వుతున్నారని, ఇలాంటి స్వార్థ, నీచ, మతపిచ్చిగాళ్లను ఎక్కడిక్కడ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చామంటే నరేంద్ర మోదీ ఉల్టా పల్టా మాట్లాడుతున్నారని, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు నీరురావాలి, మేం మనుషులం కాదా, భారతదేశంలో భాగంకాదా, వంద దరఖాస్తులు ఇచ్చినా ఉలుకు, పలుకు లేదన్నారు. సుప్రీంకోర్టులో కేసు వేసినం, ఉపసంహరించుకుంటే నీళ్లిస్తామన్నారన్నారు.
ఏడాదైనా పట్టించుకోవడం లేదని, కేంద్రంలోని ఈ ప్రభుత్వాన్ని సాగనంపితేనే మనం బాగుపడుతాం, మనం సాగు నీరొస్తదని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎం కార్యాలయ ఓఎస్డీ స్మితాసబర్వాల్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పీవీ వాణీదేవి, నవీన్‌కుమార్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, యెగ్గె మల్లేశం బోగారపు దయానంద్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్ యాదవ్, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, మహేశ్‌రెడ్డి, మెతుకు అనంద్, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, వేద సాయిచంద్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్‌కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత పి.కార్తీక్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడాలేని స్థాయిలోరంగారెడ్డి భూముల ధరలు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోతాయని కొందరు ప్రచారం చేశారు, ఇప్పుడు దేశంలో ఎక్కడాలేని స్థాయిలో భూముల ధరలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా ఏ శాఖ కార్యాలయం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండేదని, కానీ సమీకృత కలెక్టరేట్‌తో అన్ని శాఖలు ఒకే సముదాయంలోనే అందుబాటులో ఉండేలా కలెక్టరేట్‌ను నిర్మించారన్నారు. కేవలం 15 రోజుల్లోనే వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నూతన కలెక్టరేట్ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారని వెల్లడించారు.
జిల్లాకు సాగునీరందించేలా సీఎం ముందుకెళ్తున్నారు.. : టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లాకు సాగునీరందించేలా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. 33 జిల్లాల్లో రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకత ఉందని, అభివృద్ధిలో రంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు.
రంగారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యేలకు రూ.10 కోట్లు..
మంత్రి సబిత, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అడిగిండ్రు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మున్సిపాలిటీలు ఎక్కువ, గ్రామాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మేడ్చల్ జిల్లాలో ఇచ్చిన మాదిరిగానే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో గతంలో ఎమ్మెల్యేలకు గతంలో నియోజకవర్గాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల నిధులిచ్చినం, ఈ నిధులకు అదనంగా ఒక్కో ఎమ్మెల్యేకు మరో రూ.10 కోట్లను నియోజకవర్గ అభివృద్ధికి నిధులిస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.