బొంరాస్‌పేట, ఆగస్టు 23 : విద్యార్థుల భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. నేటి బాలలే రేపటి భావి పౌరులుగా తీర్చిదిద్దేది పాఠశాలల్లోనే. అందుకే గుడికి చేసే ఉపకారం కంటే బడికి చేసే సాయం ఎక్కువ అంటారు. అటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు ఉపయోగపడే పనుల కోసం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. కోట్ల సంపాదన ఉన్నా కొందరికి దానగుణం ఉండదు. కొందరు దాతలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తాము సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పాఠశాలలకు విరాళంగా అందించి పాఠశాల, విద్యాభివృద్ధికి సహకరిస్తున్నారు. మరికొందరు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచడానికి నగదు ప్రోత్సాహకాలు అందించి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మండలంలోని బొంరాస్‌పేట ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు, గ్రామానికి చెందిన దాతలు, పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులు బడిపై ఉన్న మమకారంతో కొంత డబ్బును విరాళంగా అందించి తమ ఉదారతను చాటుకున్నారు. దాతల సహకారంతో చేపట్టిన పనులు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
రూ.8.33 లక్షల విరాళాలు
బొంరాస్‌పేట ఉన్నత పాఠశాలకు దాతలు రూ.8.33 లక్షలు విరాళంగా అందించారు. వీటితో పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే పలు పనులు చేపట్టారు. విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ ప్లాట్ ఫాం నిర్మాణానికి బొంరాస్‌పేటకు చెందిన కోవూరు విజయవర్ధన్ రూ.1.10 లక్షలు, 1991 బ్యాచ్ ఎస్సెస్సీ విద్యార్థులు రూ.76 వేల విలువ చేసే గ్రంథాలయ పుస్తకాలు, బీరువా, ప్రొజెక్టర్, పోడియం, మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ చల్లా మల్కిరెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ షెడ్ నిర్మాణానికి రూ.58 వేలు, పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు బాలుర మూత్రశాల నిర్మాణానికి రూ.1.58 లక్షలు, పాఠశాల పూర్వ ఉపాధ్యాయురాలు గౌతమిధర్మ బాలికలు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి రూ.80 వేల విలువ చేసే పది కుట్టు మిషన్లు, ఒక బ్యాండ్ సెట్, సౌమ్య అనే ఉపాధ్యాయురాలు రూ.14 వేల 500 విలువ గల స్టీల్ ట్యాంకు, హెచ్ఎం పాపిరెడ్డి, ఉపాధ్యాయ బృందం వంట గది నిర్మాణానికి రూ.36 వేలు, ఉపాధ్యాయురాలు శ్రీలత రూ.8500ల బీరువా, మంజుల ఉపాధ్యాయురాలు రూ.5 వేల విలువ గల ఐదు ఐరన్ స్టూళ్లు విరాళంగా అందించారు. పూర్వ ఉపాధ్యాయుడు శంకర్ పాఠశాలలో చదువులతల్లి సరస్వతీదేవి విగ్రహం, మందిరం నిర్మాణానికి రూ.80 వేలు విరాళంగా అందించారు. అవే కాకుండా పాఠశాలలో సుదీర్ఘకాలం గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసిన దివంగత గోపాల్‌రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కొడుకు సంగమేశ్వర్‌రెడ్డి ఎస్సెస్సీలో ఉత్తమ జీపీఏ మార్కులు పొందిన నలుగురు విద్యార్థులకు ఏటా రూ.20వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఈ విధంగా దాతలు అందిస్తున్న సహకారం బొంరాస్‌పేట ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
రోటరీక్లబ్ సహాయం
మండలంలోని చిల్ముల్ మైలారం యూపీఎస్‌ను హైదరాబాద్‌కు చెందిన రోటరీ క్లబ్ సంస్థవారు హ్యాపీ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి విద్యార్థులు కూర్చోవడానికి 80 డ్యూయెల్ డెస్క్ బెంచీలను అందజేశారు. రేగడిమైలారం యూపీఎస్ పాఠశాలకు కూడా రోటరీక్లబ్ వారు బెంచీలు అందించారు.
దాతల సహకారం అభినందనీయం
బొంరాస్‌పేట ఉన్నత పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించడం సంతోషం. వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దాతలు అందించిన విరాళాలతో చేపట్టిన పనులు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి విద్యాభివృద్ధి కార్యక్రమాలకు దాతలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలి.
-పాపిరెడ్డి, హెచ్ఎం బొంరాస్‌పేట ఉన్నత పాఠశాల