పెద్దేముల్, ఆగస్టు 22 : అంబురామేశ్వర జాతర అంగరంగవైభవంగా జరిగింది. జాతరకు వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించి మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఆటబొమ్మలు, మిఠాయిలు, ఇతర వస్తువుల దుకాణ సముదాయాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని చర్యలు తీసుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. స్థానిక ఇన్చార్జి ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించారు. జాతరలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరేశం, ప్రధాన కార్యదర్శి శంకర్, తట్టేపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజయ్య, అడికిచెర్ల సర్పంచ్ జనార్దన్‌రెడ్డి,ఎంపీటీసీ ధన్సింగ్, డీలర్ అంజయ్య పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం
అంబురామేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి అన్నారు. వారు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు స్థానిక నాయకులు పలువురు మాట్లాడుతూ.. తట్టేపల్లిలో ప్రసిద్ధి గాంచిన అంబురామేశ్వరస్వామి ఆలయం ఉండడం తమ అదృష్టమన్నారు. అగ్రనేతలు వీలైనంత త్వరగా సీఎం కేసీఆర్ దృష్టికి తట్టేపల్లి మండల ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్లి తట్టేపల్లి ప్రాంతాన్ని ప్రత్యేక మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం అతిథులను ఆలయ కమిటీ సన్మానించింది.
బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో అన్నదానం
వికారాబాద్, ఆగస్టు 22 : వికారాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న బుగ్గరామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఉదయం ఆరు గంటలకు మహా రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు జరిపించారు. ఆలయ చైర్మన్ ఆత్మలింగం, మల్లికార్జున్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించిన స్వామివారి కల్యాణానికి పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తిలకించారు. కల్యాణం అనంతరం స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అన్నదానం ఏర్పాటు చేశారు.
పూజలు, అభిషేకాలు నిర్వహించిన అర్చకులు
కులకచర్ల, ఆగస్టు 22 : శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులలో కిటకిటలాడింది. శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు అత్యధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి రావడంతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా భక్తులు తరలివచ్చారు. తొక్కిసలాట జరుగకుండా కులకచర్ల ఎస్ఐ గిరి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం కార్యనిర్వహణాధికారి సుధాకర్, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది ఆలయం, గుండం వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. స్వామివారిని పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తండ్రి
బషీరాబాద్, ఆగస్టు 22 : ఏకాంబర రామలింగేశ్వరుడి జాతరకు ప్రజలు పోటెత్తారు. శ్రావణ మాసం చివరి సోమవారం జరిగే జాతరకు రాష్ట్ర ప్రజలతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరై రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి రామలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులు, ప్రజలకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాండూరు రూరల్ సీఐ రాంబాబు పర్యవేక్షణలో ఎస్సై అన్వేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. వైద్య సిబ్బంది జాతరకు వచ్చిన భక్తులు, ప్రజలకు వైద్య అవసరాలు అందించారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తండ్రి విఠల్‌రెడ్డి రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ వారిని సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.