పదిహేను రోజులుగా కనుల పండువగా సాగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగిశాయి. సోమవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ముగింపు వేడుకలు అదిరిపోయాయి. స్టేడియం మొత్తం త్రివర్ణ శోభితం కాగా, దేశభక్తి గీతాల ఆలాపన, జాతీయ జెండాల ప్రదర్శన, పటాకుల మోతతో సంబురాలు అంబురాన్నంటాయి. ఉమ్మడి జిల్లా నుంచి ప్రభుత్వం ప్రత్యేక ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచగా.. ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు భారీగా తరలివెళ్లారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు తదితరులు ముగింపు వేడుకకు హాజరయ్యారు. వజ్రోత్సవాలకు ఈ నెల 8వ తేదీన శ్రీకారం చుట్టగా.. రోజుకో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ జాతీయతను చాటారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఇంటింటిపై జెండా ఆవిష్కరణ, రక్తదాన శిబిరాలు, కవి సమ్మేళనం, వనమహోత్సవం, ఆటలపోటీలు వంటి కార్యక్రమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్యతా స్ఫూర్తిని చాటారు. థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా చూపించారు.
రంగారెడ్డి, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ)/పరిగి : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించింది. సోమవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలు అదిరిపోయేలా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు.
ముగింపు ఉత్సవాల్లో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు, వికారాబాద్ కలెక్టర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీల చైర్మన్లు, కమిషనర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 8 నుంచి 22 వరకు పలు కార్యక్రమాలను నిర్వహించారు.
ఇంటింటిపై జెండాల ఆవిష్కరణ, రక్తదాన శిబిరాలు, కవి సమ్మేళనం, వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి ఫ్రీడమ్ పార్కులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున మొక్కలు నాటడం, ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉచితంగా గాంధీ సినిమా ప్రదర్శన, ఉద్యోగులకు ఫ్రీడమ్ కప్ పేరిట క్రీడా పోటీల నిర్వహణ, అనాథ ఆశ్రమాలు, దవాఖానలు, జైళ్లలో పండ్ల పంపిణీ, స్వయం సహాయక సంఘాలు, మహిళల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఒకే రోజు లక్షలకొద్దీ మొక్కలను నాటారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో వజ్రోత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.