ఉపాధిహామీ కూలీలకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం వారికి వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉద్యోగవకాశాలు కల్పించనున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు ఉపాధిహామీ పనులు పూర్తి చేసిన కుటుంబాల్లోని 18 నుంచి 45 ఏండ్లలోపువారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు అర్హులైనవారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్హతను బట్టి పలు అంశాల్లో మెళకువలు నేర్పి ఉపాధి కల్పించనున్నారు. మొత్తం 296 మందికి సుస్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. మొదటగా 100 మందికి ఈ నెలాఖరులోపు శిక్షణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజనం అందించడంతోపాటు రోజూ కూలీ రూ.237 చెల్లించనున్నారు.
పరిగి, ఆగస్టు 22 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కుటుంబాలకు మరింత తోడ్పాటునందించేందుకు వీలుగా ఉన్నతి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇచ్చి ఆయా కుటుంబాలు ఆర్థికంగా ప్రోత్సహించాలన్నదే సర్కారు లక్ష్యం. ఇందుకు సంబంధించి ‘ఉన్నతి’ శిక్షణ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించే కార్యక్రమం కొనసాగుతున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో వంద రోజులు ఉపాధి హామీ పనులు పూర్తి చేసిన కుటుంబాలు 14,214 ఉన్నాయి. వాటిలో 18 నుంచి 45 ఏండ్ల లోపువారు ‘ఉన్నతి’ ద్వారా శిక్షణ పొందడానికి అర్హులను ఎంపిక చేసి వారిలో 296 మంది యువతకు శాశ్వత ఉపాధి కల్పించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా 100 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. మూడు విభాగాల్లో ఉపాధి హామీ కూలీల కుటుంబాల్లోని నిరుద్యోగులైన వారికి వారి విద్యార్హత, వివిధ అంశాలపై గల ఆసక్తి ఆధారంగా శిక్షణ ఇవ్వనున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ నెలాఖరు లోపు శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వమే ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పించడంతోపాటు వారికి శిక్షణకు హాజరైనన్ని రోజులు రోజు కూలీ రూ.237 చొప్పున అందజేయనున్నారు.
స్వయంగా కలిసి దరఖాస్తుల స్వీకరణ
ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పనులు పూర్తి చేసిన కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉచితంగా స్వయం ఉపాధి కోసం శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 296 మందికి శిక్షణ కోసం నిర్ణయించగా.. ఇప్పటికే 21 మందికి శిక్షణ ఇప్పించగా.. వారిలో 14 మందికి శిక్షణ పూర్తయిన తర్వాత వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. మరో 7గురు శిక్షణ పొందుతున్నారు. వెనువెంటనే 100 మందికి శిక్షణ ఇప్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్ణయించారు. జిల్లా పరిధిలో 14214 మంది అర్హులుండగా వారి విద్యార్హత, ఆసక్తి ఆధారంగా ఈ శిక్షణకు ఎంపిక చేయనున్నారు.
ఉచిత శిక్షణ, వసతి సదుపాయాలు కల్పిస్తున్నా సరైన అవగాహన లేకపోవడంతో ఆయా మండలాల్లోని అర్హులైన వారందరినీ వ్యక్తిగతంగా కలిసి శిక్షణకు వచ్చేలా చూడాలని జిల్లాస్థాయి అధికారులు సూచించారు. ప్రతి మండలంలోని గ్రామాల నుంచి కనీసం ఐదుగురికి తక్కువ కాకుండా ఈ ఉచిత శిక్షణకు హాజరయ్యేలా చూసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు మరో 10 మందిని న్యాక్‌కు శిక్షణ కోసం పంపించగా.. వికారాబాద్‌లో డీఆర్డీఏ ద్వారా అందించే శిక్షణకు 10 మంది వచ్చారు. వెనువెంటనే శిక్షణా తరగతులను ప్రారంభించేందుకు కనీసం 30 మందికి పైగా ఉండేలా మూడు బ్యాచ్‌లుగా శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులను ఎంపిక చేసి ఈ నెలాఖరులో శిక్షణ ప్రారంభించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఈ శిక్షణ పొందడం ద్వారా స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదుగవచ్చని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. అర్హులైన యువత ముందుకు వచ్చి శిక్షణ పొందడంతోపాటు వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందాలని సూచిస్తున్నారు.
నాలుగు సంస్థల ద్వారా ఉచిత శిక్షణ
ఉపాధి హామీ పనులు వంద రోజులు పూర్తి చేసిన కుటుంబాల్లోని నిరుద్యోగులకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం నాలుగు సంస్థల ద్వారా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమం(ఆర్ఎస్ఈటీఐ), ఇంగ్లీష్ వర్క్ రెడీనెస్ అండ్ కంప్యూటర్స్(ఈడబ్ల్యూఆర్‌సీ, డీఆర్డీఏ), నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్(ఎన్ఏసీ), వ్యవసాయ పరిజ్ఞాన పెంపు శిక్షణ(కేవీకే)ల ద్వారా నిరుద్యోగ యువతకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణా కాలంలో రోజుకు రూ.237 అందజేయనున్నారు. ఈడబ్ల్యూఆర్‌సీ, డీఆర్డీఏ వికారాబా ద్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ వర్క్ రెడీనెస్ అండ్ కం ప్యూటర్స్, లైవ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిటైల్, మార్కెటింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణ 18 – 26 ఏండ్ల లోపు బాలికలకు 90 రోజులపాటు ఇవ్వనున్నారు.
‘ఉన్నతి’ శిక్షణకు అర్హుల గుర్తింపు : కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా
2018-19 సంవత్సరానికిగాను జిల్లాలో ఈ ఉచిత శిక్షణకు 14,214 మంది అర్హులుగా గుర్తించారు. ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పని పూర్తి చేసిన కుటుంబాల్లోని అర్హులైన యువత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఆసక్తి గల రంగంలో శిక్షణ పొందడానికి ఇదొక చక్కటి అవకాశం. ఉచితంగా వసతి, భోజన సదుపాయం సైతం కల్పించడంతోపాటు శిక్షణకు హాజరైనన్ని రోజులు రోజువారీ కూలీ ఎంత ఉంటుందో, ఈ మేరకు డబ్బులు అందజేస్తారు. యువత ఆర్థిక ఎదుగుదలకు ఇదో చక్కటి అవకాశం.