ఆదిబట్ల, ఆగస్టు 17 : రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో నూతనంగా నిర్మించిన కలెక్టర్ భవనాన్ని కలెక్టర్ అమయ్‌కుమార్, అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రతి కార్యాలయాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కలెక్టరేట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని 40 ఎకరాల స్థలంలో రూ.32 కోట్లు వెచ్చించి ఔటర్ రింగురోడ్డుకు పక్కనే అద్భుతంగా నిర్మించారన్నారు.
రంగారెడ్డి జిల్లా ఎంతో విశాలంగా ఉండటంతో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలుగా విభజించి నూతన కలెక్టరేట్లు నిర్మించారన్నారు. వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కలెక్టరేట్లను ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతామన్నారు. పక్క రాష్ర్టాల్లో సెక్రెటేరియట్లను మించి నేడు రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం యూనిట్‌గా, జిల్లా యూనిట్‌గా, మండలం యూనిట్‌గా, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులో అన్ని శాఖల అధికారులు ఓకే చోట ఉండేలా ఈ కలెక్టరేట్‌ను ఏర్పాటు చేశారన్నారు.
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి : కలెక్టర్ అమయ్‌కుమార్
కలెక్టరేట్ భవనాన్ని ఏ సమయంలోనైనా ప్రారంభిస్తారని.. వెంటనే పెండింగ్ పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అమయ్‌కుమార్ జిల్లా అధికారులకు సూచించారు. కార్యాలయం బయట చుట్టు పెద్దఎత్తున మొక్కలు నాటి కార్యాలయంలోకి వివిధ పనులపై ప్రజల వాహనాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలన్నారు. కార్యాలయంలో కూడా కొన్ని మైనర్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే పూర్తిచేయాలన్నారు.
కార్యక్రమంలో డీపీఆర్వో పద్మజ, డీఆర్వో హరిప్రియ, ఆదిబట్ల మున్సిపల్ వైస్‌చైర్మన్ కళమ్మ, మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ రామ్మోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్, కృష్ణంరాజు, నగేశ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ ఆదిబట్ల మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగయ్య, టీఆర్ఎస్ నాయకుడు జంగయ్య వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.