యాచారం, ఆగస్టు 7 : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించింది. ఫలితంగా మత్స్యకారులు చెరువుల్లో పెరిగిన చేపలతో మంచి ఉపాధి పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా మండలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. చెరువుల్లో పెరిగిన చేపలు మత్స్యకారులకు సిరులను కురిపిస్తున్నాయి. చేపల విక్రయాలతో మత్స్యకారులు జీవనోపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మండలంలోని కుర్మిద్ద గ్రామంలో గల పెద్దచెరువు, మేడిపల్లి ఊరచెరువు, సాలి చెరువుల వద్ద మత్స్యకారులు జోరుగా చేపలు పడుతున్నారు. చింతపట్ల లక్ష్మణ చెరువులో చేపలు 3 కిలోల నుంచి 12 కిలోల సైజులో ఉన్నాయి. చెరువుల వద్ద చేపలు తాజాగా లభిస్తుండటంతో చేపల విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది.
ఆదివారం మేడిపల్లి ఊర చెరువు వద్ద మత్స్యకారులు చెరువుల్లో పెంచిన రవ్వ, బొచ్చ, గ్యాస్‌కట్టర్ చేపలను ప్రజలకు విక్రయించారు. కిలో రూ.150 చొప్పున చెరువుల వద్దే విక్రయించారు. కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి, మీర్ఖాన్పేట, మల్కీజ్‌గూడ, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, ఆకులమైలారం తదితర గ్రామాలనుంచి ప్రజలు చెరువుల వద్దకు వెళ్లి చేపలను కొనుగోలు చేశారు. మండలంలోని తాటిపర్తి బందం చెరువు, నానక్‌నగర్ తలాబ్ చెరువు, మేడిపల్లి ఎక్వ చెరువు, సాలి చెరువు, ఊర చెరువు, తక్కళ్లపల్లి చెన్నారెడ్డి చెరువు, చింతపట్ల లక్ష్మణ చెరువు, నందివనపర్తి కాముని చెరువు, కుర్మిద్ద పెద్ద చెరువు, ధర్మపురి చెరువుల్లో మత్స్యకారులు ముమ్మరంగా చేపలను పెంచుతున్నారు. పెరిగిన చేపలను పట్టి ప్రజలకు చెరువుల వద్దనే విక్రయిస్తున్నారు. తాజా చేపలు కావడంతో ప్రజలు చేపలను కొనడానికి పోటీపడుతున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో ప్రభుత్వం చెరువుల్లో పూడిక తీయడంతో వాటిలో నీటి సామర్థ్యం పెరుగడం, మత్స్యకారులు చేపలు పెంచేందుకు సహకరించడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులకు తగిన ఉపాధి కల్పించేందుకు చెరువుల్లో సబ్సిడీతో చేపపిల్లలను వేయడం మత్స్యకారులకు ఎంతో మేలు జరిగిందని సంబురపడిపోతున్నారు. గతేడాది కంటే అధికంగా చేపపిల్లలను పెంచడంతో అదే స్థాయిలో మత్స్యకారులు లాభాలను పొందుతున్నారు. చేపల దిగుమతి లేకుండానే తాజా చేపలు తక్కువ ధరకు స్థానికంగా లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సొసైటీలకు మోటర్ సైకిళ్లు, వలలు, ఐస్ బాక్సులు, జీవిత బీమా వసతులను కల్పించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేసింది: కానమోని గణేశ్, మత్స్యకారుడు, మేడిపల్లి
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేసింది. మత్సకారులకు సబ్సిడీ కింద చేపపిల్లలను, వ్యాపార వృద్ధి కోసం మోటార్ సైకిళ్లు, చేపలు పట్టేందుకు వలలు, చేపలు నిల్వచేసేందుకు ఐస్ బాక్సులు అందజేసింది. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం మరిన్ని పథకాలు తీసుకురావాలి. రానున్న రోజుల్లో వర్షాలు బాగా కురిసి చెరువులు, కుంటలు నిండి ప్రభుత్వ సహకారంతో మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నిండాలి.
చేపల పెంపకంతో మత్స్యకారులకు జీవనోపాధి: చిన్నోళ్ల జంగమ్మ, జడ్పీటీసీ, యాచారం
చెరువుల్లో పుష్కలంగా నీరుండటంతో చేపల పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంది. చేపల పెంకంతో మత్స్యకారులకు మంచి ఉపాధి దొరికింది. మండల పరిధిలోగల బందం చెరువు, తలాబ్ చెరువు, లక్ష్మణ చెరువు, ఎక్వ చెరువు, సాలి చెరువు, ఊర చెరువులు మత్స్యకారులకు తగిన జీవనోపాధి కల్పిస్తున్నాయి. చెరువుల్లో చేపలను పెంచడంతో మండలంలో చేపల కొరత లేకుండా పోయింది. ప్రభుత్వం మత్స్యకారులకు మరింత ప్రోత్సాహాన్ని కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి.