పరిగి, ఆగస్టు 4 : ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఆదరాభిమానాలు చూరగొంటున్న టీఎస్ ఆర్టీసీ ఆదాయం పెంపుపై దృష్టి పెట్టింది. ఇప్పటివరకు బస్సుల్లో ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయడం ద్వారా ఆదాయం ఆర్జిస్తుండగా.. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో ఆర్టీసీలో కార్గో సేవలతో లాభాలు వస్తున్నాయి. వీటికితోడుగా ఆర్టీసీకి సంబంధించిన స్థలాల్లో దుకాణాల నిర్మాణం చేపట్టడం ద్వారా అద్దెకు ఇచ్చి వాటి ద్వారా నెలవారీగా పక్కా ఆదాయం వచ్చేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో మూడు డిపోలున్నాయి. పరిగి డిపోలో 78 బస్సులకు రోజూ సుమారు రూ.10లక్షలు, తాండూరులో 84 బస్సులకు రూ.10లక్షలు, వికారాబాద్‌లో 69 బస్సులకు రోజుకు సుమారు రూ.7లక్షల వరకు ఆదాయం చేకూరుతున్నది. పరిగి, వికారాబాద్, తాండూరులో గల దుకాణాల సముదాయాల ద్వారా నెలకు సుమారు రూ.2.72లక్షల ఆదాయం సమకూరుతున్నది. ఈ ఆదాయంతోపాటు అదనంగా మరో రూ.4లక్షల ఆదాయం వచ్చేలా జిల్లాలోని సంస్థకు సంబంధించిన స్థలాల్లో దుకాణాల నిర్మాణం, బీవోటీ పద్ధతిన ఇచ్చేందుకు నిర్ణయించారు.
నెలవారీగా ఆదాయం పెంపు కోసం..
టీఎస్ ఆర్టీసీకి వికారాబాద్ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల ఉన్న స్థలాల్లో దుకాణాల సముదాయాలు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని రెండు రెట్లు పెంచుకునేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నది. జిల్లాలోని పరిగిలో గల గంజ్‌రోడ్డులో 36 దుకాణాల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. దీంతో నెలకు సుమారు రూ.3.50లక్షలకు పైగానే ఆదాయం సమకూరనుంది. మన్నెగూడ క్రాస్‌రోడ్డులో 15 దుకాణాలను ప్రస్తుతం అక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్న వారికే ఇవ్వడం ద్వారా నెలకు సుమారు రూ.30వేలు ఆదాయం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు మర్పల్లిలో గల స్థలంలో 20 దుకాణాలు, మోమిన్‌పేట్‌లో 8 దుకాణాల నిర్మాణాలకు అంచనాలు తయారు చేశారు. తాండూరులోని ఫ్లై ఓవర్ వద్ద 5 దుకాణాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వికారాబాద్‌లోని బస్టాండ్ వద్ద ప్రధాన రహదారి పక్కన 15 దుకాణాల నిర్మాణానికి నిర్ణయించారు. ధారూరు, కులకచర్ల, నంచర్ల, నవాబుపేట తదితర చోట్ల ఆర్టీసీకి చెందిన స్థలాల్లో దుకాణాల నిర్మాణం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇందుకుగాను వెడల్పు 8 చదరపు అడుగులు, పొడవు 10 చదరపు అడుగుల స్థలం ఉండేలా నిర్మాణం చేపట్టే దుకాణం కోసం రూ.5లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించడంతోపాటు టెండర్లలో ఎక్కువగా అద్దె కోట్ చేసిన వారికే దుకాణం ఇవ్వనున్నారు. అడ్వాన్స్‌గా చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వబడవు. లీజు కాల పరిమితి 10 సంవత్సరాలుగా నిర్ణయించారు. దుకాణాల నిర్మాణానికి ఒక్క రూపాయి అదనపు భారం సంస్థపై పడకుండా టెండర్లలో పాల్గొనేవారు చెల్లించే అడ్వాన్సు ద్వారానే నిర్మాణ పనులు పూర్తి చేయించడంతోపాటు డబ్బులు మిగిలే అవకాశాలు ఉన్నాయి. దీంతో సంస్థపై ఎలాంటి భారం లేకుండానే కొత్తగా దుకాణాల నిర్మాణాలు జరిపేందుకు ఈ విధానం దోహదం చేయనుంది.
పరిగి, తాండూరులలో మొదటి అంతస్తులో..
పరిగి, తాండూరు పట్టణాలలో ప్రస్తుతం ఉన్నటువంటి దుకాణాల సముదాయాలకు మంచి డిమాండ్ ఉండడంతో మొదటి అంతస్తులో మరిన్ని దుకాణాల నిర్మాణం చేపట్టి అద్దెకు ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రధాన రహదారుల పక్కన ఈ పట్టణాల్లో దుకాణాలు ఉండడంతో వ్యాపార లావాదేవీలు బాగా జరుగుతాయి. అందువల్ల దుకాణాలకు డిమాండ్ ఉన్నది. మార్కెట్లో డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పరిగి, తాండూరులలోని దుకాణాల మొదటి అంతస్తులోనూ మరిన్ని దుకాణాల నిర్మాణాలకు నిర్ణయించారు. ఈమేరకు ఉన్నతాధికారుల ఆమోదం కోసం లేఖ రాసినట్లు తెలిసింది. కొత్తగా దుకాణాల సముదాయాలు నిర్మించే ప్రాంతాల్లో అద్దె కోసం వ్యాపారస్తులను కలిసి వివరించేలా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను సైతం నియమించారు. వారు విస్తృతమైన ప్రచారం చేసి దుకాణాలు అద్దెకు తీసుకునేందుకు పలువురు ముందుకు వచ్చేలా కృషి చేస్తారు.
సంస్థ ఆదాయం పెంపు కోసం..
– జ్యోతి, డివిజనల్ మేనేజర్, టీఎస్ఆర్టీసీ
టీఎస్ ఆర్టీసీ సంస్థ ఆదాయం పెంచుకోవడంలో భాగంగా సంస్థకు గల స్థలాల్లో దుకాణాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే పరిగిలోని గంజ్‌రోడ్డులో 36 దుకాణాల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. పరిగి, తాండూరులలో ప్రస్తుతం ఉన్న దుకాణాలపై మొదటి అంతస్తులో మరిన్ని దుకాణాలు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. జిల్లాలోని పలుచోట్ల సంస్థకు గల స్థలాల్లో బీవోటీ పద్ధతిలో దుకాణాలు నిర్మాణం చేపట్టి అద్దెకు ఇవ్వనున్నాం.