ఇబ్రహీంపట్నం, ఆగస్టు 1 : వానకాలంలో సోకే సీజనల్ వ్యాధుల విషయంలో రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఎమర్జెన్సీ వైద్యబృందాలు పరీక్షలు చేసి, మందులు అందించేలా ప్రణాళికను సిద్ధం చేసింది. మలేరియా, డయేరియా, డెంగీ, చికున్ గున్యా, మెదడువాపు తదితర వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. జలుబు, దగ్గు, వాంతులు, విరోచనాలు, ఎలర్జీకి సీజనల్ వ్యాధులు కారణమవుతాయి. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులను నివారించవచ్చు. కలుషిత నీటితో దోమలు, ఈగలు, సూక్ష్మక్రిములు వ్యాపించి జబ్బుల బారినపడుతారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత ప్రభుత్వ దవాఖాన లేదా గ్రామ ఆశ వర్కర్‌ను సంప్రదించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతితో పట్టణాలు, పల్లెలు శుభ్రంగా మారి, అంటువ్యాధుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు.
అందుబాటులోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు..
జిల్లా దవాఖాన, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 104, 108 సర్వీసులను వినియోగించుకోవచ్చు. సర్కారు దవాఖానల్లో 38 రకాల పరీక్షలు చేసేలా ల్యాబోరేటరీలు సిద్ధంగా ఉన్నాయి. వానకాలంలో అధికంగా డయేరియా, వాంతులు, విరోచనాలు, తలనొప్పి అధికంగా వస్తుంటాయి. ప్రభుత్వ దవాఖానలకు వెళ్తే రక్త, మూత్ర పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. పల్లెల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ అవగాహన కల్పిస్తున్నది.
కలుషిత నీటితో జాగ్రత్త..
డయేరియా కలుషితమై నీరు, ఆహారం వల్ల డయేరియా వ్యాప్తి చెందుతుంది. వాంతులు, విరోచనాలు ఎక్కువగా ఉంటాయి. కడుపు నొప్పి, దామం, నోరు ఎండిపోవడం, చర్మం ముడతలు పడుతాయి. మూత్రవిసర్జన పూర్తిగా తగ్గిపోతుంది. కలుషిత నీరు, నిల్వ ఉంచిన ఆహారానికి దూరంగా ఉండాలి. దోమల వల్ల మలేరియా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. రోజు విడిచిరోజు జ్వరం, తల, ఒళ్లునొప్పులు, చెమటలుపట్టడం, వాంతులు కావడం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
డెంగీ జ్వరం..
ఈడిన్ ఈజిప్ట్దోమ వల్ల డెంగీ సోకుతుంది. నల్లగా ఉండే ఈ దోమ ఒంటిమీద తెల్లని చారలు ఉంటాయి. పగటి సమయంలో ఎక్కువగా కుడుతుంది. మూతల్లేని నీళ్ల ట్యాంకులు, సిమెంట్, తారు రోడ్లమీద నిలిచి ఉండే వర్షపు నీటిలో, ఇంట్లో పూలకుండీలు, కూలర్లు, పాత టైర్లు, వాడకుండా వదిలేసిన పాత్రలు, కొబ్బరి చిప్పలు వంటి వాటిల్లో ఈ దోమలు పెరుగుతాయి. చీకటిగా ఉండే మూలాల్లో కర్టెన్లు, వేలాడే వస్తువుల్లో గొడుగులో దాక్కుని ఉంటాయి. దోమ కుట్టిన ఏడు నుంచి ఎనిమిది రోజుల తర్వాత తీవ్ర జ్వరం వస్తుంది. ఎముకల్లో, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై పొక్కులు వస్తాయి. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మలవిసర్జన, కడుపునొప్పి ఉంటాయి. రక్తపోటుతో పాటు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతాయి. కొన్నిసార్లు అన్ని రకాల అవయవాలు విఫలం చెంది ప్రాణాపాయం సంభవిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అందుబాటులో వైద్యసేవలు..
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్లలో సీజనల్ వ్యాధులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయి. ఏఎన్ఎంలు, ఆశవర్కర్లను సంప్రదిస్తే ఇంటి వద్దకు వచ్చి మందులను అందజేస్తారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో అదనపు వైద్య బృందాలను నియమించాం.
– స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి