షాద్నగర్ టౌన్, జూలై 28: తెలంగాణకు మణిహారంగా నిలిచింది హరితహారం. పచ్చని చెట్లతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ప్రతిష్టాత్మకంగా చేపడుతూ మొక్కలను నాటుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్నది. రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు పచ్చని మొక్కలతో స్వాగతం పలుకుతున్నాయి.
నర్సరీల్లో సిద్ధంగా వివిధ రకాల మొక్కలు
ఈ ఏడాది హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం మున్సిపాలిటీలోని మూడు నర్సరీల్లో లక్షా 50వేల మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం పట్టణంలోని మూడు నర్సరీల్లో జామ, దానిమ్మ, ఉసిరి, కానుగ, టెకోమా, మర్రి, రావి, సీతాఫలం, చైనాబాదం, నేరేడు, కరివేపాకు, చామంతి, వేప, బంతి, అశోక మొక్కలతోపాటు వివిధ రకాల పూల, పండ్ల మొక్కలను పెంచి అందుబాటులో ఉంచారు. హరితహారంలో భాగంగా పట్టణంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ట్రీగార్డులను ఏర్పాటు చేయనున్నారు.
అందరూ మొక్కలు నాటాలి
ఈ ఏడాది హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో మొక్కలను నాటడంతోపాటు ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పం పిణీ చేసి సంరక్షించే బాధ్యతను కూడా వారికి అప్పగించనున్నాం. హరితహారంలో అందరూ విధిగా మొక్కలను నాటాలి. హరితహార లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
-జయంత్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, షాద్నగర్