రంగారెడ్డి, జూలై 27, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం జిల్లాలో జోరందుకుంది. అధికారులు, ప్రజలు ఇలా అందరూ హరిత యజ్ఞంలో భాగస్వాములవుతుండడంతో తెలంగాణకు హరితహారం ఉద్యమంలా సాగుతున్నది. మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది.
ఇందులో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన జియో ట్యాగింగ్ యాప్‌లో ఎక్కడెక్కడ ఎన్ని మొక్కలు నాటారనే వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. ఎక్కడైతే మొక్కలు నాటుతారో అక్కడ నావిగేషన్‌తో మొక్కల ఫొటోలు తీసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ పాఠశాలలు, స్థలాల్లో మొక్కలను నాటుతున్నారు. ఈ ఏడాది అవెన్యూ ప్లాంటేషన్(రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం)కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.
జోరందుకున్న హరితహారం
జిల్లాలోని గ్రామీణ ప్రాంతంతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ మొక్కలు నాటే కార్యక్రమం జోరందుకుంది. హారితహారంలో భాగంగా అన్ని శాఖలు భాగస్వాములై, ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటే ప్రక్రియ కొనసాగుతున్నది. మొక్కలను నాటిన అనంతరం విస్మరించడం కాకుండా ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ప్రధానంగా టేకు, శ్రీగంధం, ఉసిరి, నల్లమద్ది, తెల్లమద్ది, పూలు, పండ్ల మొక్కలతోపాటు జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, పప్పాయ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార తదితర మొక్కలను నాటుతున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంటి ఆవరణలో జామ, కరివేపాకు, దానిమ్మ, పప్పాయ, పూల మొక్కలైన గులాబీ, మందారం, మల్లె మొక్కలతోపాటు గ్రామాల పరిధిలో వివిధ మొక్కలను నాటనున్నారు.
ఇప్పటివరకు 12.27 లక్షల మొక్కలు నాటడం పూర్తి
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది తెలంగాణకు హరితహారంలో భాగంగా 78 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 12.27 లక్షల మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హరితహారం కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేసేలా ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు నిర్దేశించారు.
ఇప్పటివరకు ఆయా శాఖల ఆధ్వర్యంలో నాటిన మొక్కలను పరిశీలిస్తే.. అటవీ శాఖ ఆధ్వర్యంలో 8 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 7.78 లక్షల మొక్కలను, విద్యాశాఖ ఆధ్వర్యంలో 40 వేలు, డీఆర్డీఏ ఆధ్వర్యంలో 2.61 లక్షలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 20,400., ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 20 వేలు, జల్పల్లి మున్సిపాలిటీలో 5 వేలు, తుక్కుగూడ మున్సిపాలిటీలో 17,300., ఆమనగల్లు మున్సిపాలిటీలో 32,400., నార్సింగి మున్సిపాలిటీలో 17,800, మణికొండ మున్సిపాలిటీలో 9 వేలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 49,600., గనుల శాఖ ఆధ్వర్యంలో 11 వేల మొక్కలను ఇప్పటివరకు నాటడం పూర్తయింది.
ప్రతి మొక్కనూ బతికించేందుకు చర్యలు
ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు తగు చర్యలు చేపట్టామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్ తెలిపారు. నాటిన వెంటనే మొక్కకు జియో ట్యాగింగ్ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటుతామన్నారు. జిల్లాలోని నర్సరీల్లో సరిపోను మొక్కలు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలిపారు.