కరోనా మహమ్మారిని కట్టిడి చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఆరు నెలలు పూర్తైన అర్హులందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. ఇందుకు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 44 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారు 23,28,538 మంది ఉండగా, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తై బూస్టర్ డోస్‌కు అర్హులు 18.94 లక్షల మంది ఉన్నట్లు జిల్లా అధికారులు లెక్కతేల్చారు. వీరిలో ఇప్పటివరకు 1,62,695 మందికి బూస్టర్ డోస్ పూర్తి కాగా, మిగిలివారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రంగారెడ్డి, జూలై 24, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ కట్టడికి జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. గత వారం, పది రోజులుగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉచితంగా బూస్టర్ డోస్‌ను పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు 60 ఏండ్లు పైబడినవారికే బూస్టర్ డోస్ ఇవ్వగా, ఈ నెల 15 నుంచి 18 ఏండ్ల నిండిన వారందరికీ ఉచితంగా డోస్‌ను ప్రారంభించారు. ఓ వైపు సీజనల్ వ్యాధులు, మరోవైపు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. గత వారం రోజులుగా జిల్లాలో 50-55 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఫస్ట్ డోస్-28,21,898 మంది, సెకండ్ డోస్-25,05,653 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.
వారం రోజులు.. 1.62 లక్షలు
కొవిడ్ వైరస్ ప్రభావాన్ని కట్టడి చేసేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకుగాను జిల్లా వైద్యారోగ్య శాఖ అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసింది. సెకండ్ డోస్ వేసుకొని ఆరు నెలలు దాటిన వారికి బూస్టర్ డోస్ వేస్తున్నారు. బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసేందుకుగాను జిల్లావ్యాప్తంగా 44 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 40 ప్రాథమిక కేంద్రాలతోపాటు రెండు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, వనస్థలిపురం ఏరియా దవాఖాన, కొండాపూర్‌లోని జిల్లా దవాఖానలో బూస్టర్ డోస్ వేస్తున్నారు. 18 ఏండ్లు నిండి సెకండ్ డోస్ వేసుకొని 6 నెలలు పూర్తైనవారు ఆధార్ కార్డు జిరాక్స్‌తో వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది.
కొవిడ్ సమయంలో ముందున్న హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బూస్టర్ వేసేందుకు సంబంధిత అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసి సరిపోను వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచారు. జిల్లాలో 18 ఏండ్లు నిండినవారు 23,28,538 మంది ఉండగా, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తై బూస్టర్ డోస్‌కు అర్హులు 18.94 లక్షల మంది ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు లెక్కతేల్చారు. వీరిలో ఇప్పటివరకు 1,62,695 మందికి బూస్టర్ డోస్ పూర్తయ్యింది. ఈ నెల 14 వరకు 60 ఏండ్లు నిండినవారికి 1,41,725 మందికి బూస్టర్ డోస్ వేయగా, గత వారం రోజుల్లో 20,970 మందికి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
గత వారం రోజుల్లో బూస్టర్ డోస్ పూర్తైన వివరాలు
14వ తేదీ వరకు 1,41,725 మంది బూస్టర్ డోస్ వేసుకున్నారు. 15న 3014, 16న 4706, 17న 536, 18న 3715, 19న 2872, 20న 2854, 21న 3273 మంది డోస్ వేసుకున్నారు.
అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ వేసుకోండి
– జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.స్వరాజ్యలక్ష్మి
జిల్లాలో అర్హులైన వారందరూ బూస్టర్ డోస్ వేసుకోవాలి. కొవిడ్ వైరస్‌తో అప్రమత్తంగా ఉండి, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీ, సీహెచ్సీలలో సరిపడా వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచాం.