బొంరాస్‌పేట, జూలై 24 : పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న మహిళా స్వయం సహాయ సంఘాలకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తులను కుట్టే బాధ్యతను ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మహిళలకు ఉపాధితో పాటు ఆర్థికంగా లాభం కలుగనుంది. గతం లో ఏకరూప దుస్తులను కుట్టడానికి ప్రభు త్వం ఆయా గ్రామాల్లోని దర్జీలకు అప్పగించేవారు. దీనివల్ల విద్యార్థులకు సమయానికి యూనిఫాంలు అందకపోయేవి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఏకరూప దుస్తుల విధానంలో మార్పులు చేసింది.
జిల్లాలో 19 మండలాలు ఉండగా వీటిలో 70 శాతం అంటే 14 మండలాల్లో పొదుపు సంఘాలను ఎంపిక చేయాలని నిర్ణయించగా, 30 శాతం మండలాలు అంటే 5 మండలాలను స్థానికంగా ఉండే దర్జీలకు అప్పగించాలని నిర్ణయించారు. 14 మండలాల్లో యూనిఫాం కుట్టడానికి పొదుపు సంఘాలను డీఆర్డీఏ అధికారులు ఎంపిక చేయ గా ఆయా మండలాల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వస్ర్తాన్ని ఇచ్చి వారం రోజుల్లో ఏకరూప దుస్తులు అందించాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక చేసిన పొదుపు సంఘాల దర్జీలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల కొలతలు తీసుకుని యూనిఫాం కుట్టివ్వాలని ఆదేశించారు.
లక్షా 7 వేల 788 మంది విద్యార్థులు
జిల్లాలోని 19 మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు కలిపి మొత్తం 1099 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్షా 7 వేల 788 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 54, 730 మంది బాలికలు ఉండగా, 53,058 మంది బాలురు ఉన్నారు. వీరికి రెండు జతల ఏకరూప దుస్తులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఒకటి నుంచి 5వ తరగతి చదివే బాలురకు నిక్కర్, షర్ట్, బాలికలకు స్కర్ట్, షర్ట్లు అందిస్తారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే బాలురకు ప్యాంట్, షర్ట్, బాలికలకు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్ అందజేస్తారు. ఇవి తరగతు లు, విద్యార్థినీ విద్యార్థులను బట్టి ఆయా రంగుల్లో ఉంటా యి. యూనిఫాం కుట్టడానికి అవసరమైన యూనిఫాం వస్త్రం ఇప్పటికే జిల్లాలోని ఎంఆర్సీ కార్యాలయాలకు చేరింది. దీనిని ఎంపిక చేసిన దర్జీలకు ఎంఈవోలు అందజేస్తారు.
పొదుపు సంఘాల ఎంపిక
జిల్లాలోని 14 మండలాలను ఏడు పొదుపు సంఘాల మహిళలకు అప్పగించారు. దోమ, కొడంగల్, బొంరాస్‌పేట మండలాల పాఠశాలల్లోని విద్యార్థులకు యూని ఫాం కుట్టడానికి కొడంగల్‌లోని సాయి కృష్ణ పొదుపు సంఘం, కులకచర్ల, చౌడాపూర్ మండలాలకు పూడూరులోని ప్రతిభ పొదుపు సంఘం, పరిగి మండలానికి పరిగికి చెందిన రాజీవ్‌గాంధీ పొదుపు సంఘం, ధారూరు, నవాబుపేట మండలాలకు వికారాబాద్‌కు చెందిన సాయిరాం పొదుపు సంఘం, కోట్‌పల్లి, బంట్వారం, మోమిన్‌పేట మండలాలకు వికారాబాద్‌కు చెందిన సాయిబాబా పొదుపు సంఘం, పెద్ద్దేముల్ మండలానికి యాలాలకు చెందిన వెన్నెల పొదుపు సంఘాన్ని ఎంపిక చేశారు. అలాగే దౌల్తాబాద్, పూడూరు, యాలాల, వికారాబాద్, మర్పల్లి మండలాల్లోని స్థానిక దర్జీలను ఎంపిక చేయాలని అధికారులు ఆదేశించారు.
వస్ర్తాన్ని పంపించాం
గత ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు జతల యూనిఫాం అందజేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 70 శాతం మండలాలను పొదుపు సంఘాల మహిళలకు, 30 శాతం స్థానికంగా ఉండే దర్జీలకు యూనిఫాం కుట్టే బాధ్య త అప్పగించాలని నిర్ణయించారు. వస్ర్తాన్ని ఎంఆర్సీ కార్యాలయాలకు పంపించాం. మహిళా సంఘాలను డీఆర్డీఏ వారు ఎంపిక చేయగా వారికి యూనిఫాం వస్త్రం ఎంఈవోల ద్వారా అందజేస్తున్నాం.
-రవికుమార్, సెక్టోరియల్ అధికారి, డీఈవో కార్యాలయం
ఉపాధితో పాటు నైపుణ్యం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతను పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు లో భాగంగా జిల్లాలోని 14 మండలాల్లోని విద్యార్థులకు యూనిఫాం కుట్టడానికి ఏడు పొదుపు సంఘాల మహిళలను ఎంపిక చేశాం. కొన్ని మండలాల్లో యూనిఫాం కుట్టే పనిని కూడా ప్రారంభించారని ఒక్కో జత కుట్టడానికి రూ.50లు చెల్లిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పన, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది. నిర్దేశించిన సమయానికి దుస్తులు అందజేయడానికి ప్రయత్నిస్తాం.
– కృష్ణన్, డీఆర్డీవో