బొంరాస్‌పేట, జూలై 24 : నూతన మండలంగా ఏర్పడిన దుద్యాలలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘనంగా సంబురాలు చేసుకున్నారు. మండలంలోని 8 గ్రామాలు, కోస్గి మండలంలోని రెండు, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల నుంచి ఒక్కో గ్రామాన్ని కలిపి 12 గ్రామాలతో దుద్యాల మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం దుద్యాలలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. పార్టీ నాయకులు, యువకులు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ బొంరాస్‌పేట, దుద్యాల మండలాల అధ్యక్షులు కోట్ల యాదగిరి, చాంద్‌పాషా, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను గౌరవించి సీఎం కేసీఆర్ దుద్యాలను మండలంగా ప్రకటించారని, మండల ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. దుద్యాల మండలం ఏర్పాటుతో చాలా గ్రామాల ప్రజలకు సౌకర్యంగా మారిందని అన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల సహకారంతో కొత్త మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అహ్మద్ పాషా, టీఆర్ఎస్ తాలుకా అధికార ప్రతినిధి టీటీ రాములు నాయక్, తాలుకా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, తాలుకా యూత్ అధ్యక్షుడు నరేశ్‌గౌడ్, దుద్యాల ఎంపీటీసీ ఎల్లప్ప, పోలేపల్లి ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, సర్పంచ్ రామకృష్ణారెడ్డి, ఆలేడ్ సర్పంచ్ నర్సింహులు, పార్టీ నాయకులు బాబర్, బసిరెడ్డి, వెంకటయ్య, టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు అన్నూబాయి, కవిత పాల్గొన్నారు.