యాచారం, జూలై22: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుకన్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయం, పశుపోషణ, విద్య, విద్యుత్, వైద్యం, హార్టికల్చర్, గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, ఎక్సైజ్, ఈజీఎస్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. మండలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం తగదని ఏఈ సందీప్‌కుమార్‌పై సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సభ్యులు కోరారు.
ఉపాధి కూలీలందరికీ పెండింగ్ బిల్లులను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఏపీవో లింగయ దృష్టికి తీసుకెళ్లారు. మండలంలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్‌లు సంబంధిత అధికారికి విన్నవించారు. రైతుబంధు, రైతుబీమా కోసం ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏవో సందీప్ సూచించారు. పశువుల దవాఖానలో జొన్నలు, మక్కలు అందుబాటులో ఉన్నాయని పశువైద్యాధికారి వనజకుమారి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలన్నంటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని సర్పంచ్‌లు ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఎంపీపీ సుకన్య మాట్లాడుతూ..మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దన్నారు. 18ఏండ్లు నిండిన వాళ్లు తప్పని సరిగా బూస్టర్ డోస్ వేసుకునేలా ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పల్లె ప్రగతి పనులను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, వ్యవసాయాధికారి సందీప్, సీడీపీవో సృజన, ఏపీవో లింగయ్య, పశువైద్యాధికారి వనజ, ఏపీఎం సతీశ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.