రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా కంది పంట సాగవుతున్నది. ఏటా 1.80లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు కందిని సాగు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని తాండూరు కందిసాగుకు పెట్టింది పేరు. దీంతో ఇక్కడ కంది బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నది. అంతేకాకుండా ఈ విషయమై ఎంపీ రంజిత్‌రెడ్డి పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. అయినా కేంద్రం చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నది. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరిపోతుందన్నట్లు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వివిధ సంస్థలను ఏర్పాటు చేస్తున్న కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నది. తాండూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున కంది పంట సాగు చేస్తుండడంతో ఈ ప్రాంత రైతులకు మరింత మేలు చేకూరాలంటే ప్రత్యేకంగా కంది బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. దీంతో అధునాతన పద్ధతుల్లో సాగు, రైతులకు శిక్షణ, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ విస్తరణతో అన్నదాతలకు ప్రయోజనం చేకూరనున్నది. ఇప్పటికైనా కేంద్ర సర్కార్ జాప్యం వీడి తాండూరులో కంది బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత రైతాంగం డిమాండ్ చేస్తుంది.
పరిగి, జూలై 20 : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో కంది బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరిపోతుందన్నట్లు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వివిధ సంస్థల ఏర్పాటుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతూ తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లాంటి రాష్ర్టాలకు చేయూత అందించడం ద్వారా మరింత అభివృద్ధికి సహకరించాల్సిందిపోయి మోకాలడ్డుతూ ఆటంకంగా నిలువడం తగదని పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్నది. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతోపాటు రైతుబంధు ద్వారా ఎకరాకు సంవత్సరానికి రూ.10వేలు పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నది. దీంతో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. ప్రధానంగా పప్పుదినుసుల ఉత్పత్తులు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ఊదరగొట్టడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం.
కంది బోర్డుతో రైతాంగానికి మేలు
కంది బోర్డు ఏర్పాటు అంశం కేంద్రంలోని వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోకి వస్తుంది. ఏదైనా పంట అత్యధిక విస్తీర్ణంలో పండిస్తున్న ప్రాంతాల్లో బోర్డు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని రైతులకు చాలావరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా బోర్డు కంది పండించే రైతాంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. పంటల సాగులో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎప్పటికప్పుడు శిక్షణా శిబిరాల ద్వారా అవగాహన కల్పిస్తుంది. రైతులు పండించిన కంది పంటను నేరుగా బోర్డు కొనుగోలు చేస్తుంది.
నాణ్యమైన సరుకులకు మంచి ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ఇతర రాష్ర్టాల్లో ఎక్కడైనా మరింత ఎక్కువ ధర ఉంటే ఆయా ప్రాంతాల వారికి విక్రయించేలా ఏర్పాట్లు చేయడం ద్వారా రైతాంగానికి ప్రయోజనం చేకూరుతుంది. కొత్తరకమైన వంగడాల కోసం రీసెర్చ్ చేయడానికి ఈ బోర్డు తోడ్పాటునందిస్తుంది.
తాండూరులో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఉండడంతో సంబంధిత శాస్త్రవేత్తలు కొత్త రకం కంది వంగడాల కోసం చేసే పరిశోధనలకు తోడ్పాటు లభించేది. ఇప్పటికే వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో సేంద్రీయ పద్ధతిలో కంది సాగు చేయిస్తూ రైతుల నుంచి కందులను మద్దతు ధర లేదంటే మార్కెట్ ధర కంటే 20శాతం అధిక ధరకు కొనుగోలు చేసి పప్పు తయారు చేసి తాండూరు పప్పు పేరిట విక్రయిస్తున్నారు.
ఈ ప్రాంతానికి సంబంధించిన పప్పుకు భలే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కంది బోర్డును ఏర్పాటు చేయడంతో మరింత మంది కంది సాగుకు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఈ ప్రాంతంలో కంది సాగు విస్తీర్ణం పెంపుతో మరింత వ్యాపారాలు విస్తరించి ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశముంటుంది. పప్పు దినుసుల సాగు పెంచాలని చెబుతున్న కేంద్రం.. అందుకనుగుణంగా ఇప్పటికే పెద్దఎత్తున సాగు చేస్తున్న కందిని ప్రోత్సహించేందుకు ముందుకు రాకపోవడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా పేర్కొంటున్నారు.
కంది బోర్డు ఏర్పాటుకు ఎంపీ వినతి
జిల్లా పరిధిలోని తాండూరు ప్రాంతంలో కంది బోర్డు ఏర్పాటు చేయాలంటూ చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాండూరు ప్రాంతంలో పెద్దఎత్తున కంది పంట సాగు చేస్తుండడంతో ఈ ప్రాంత రైతులకు మరింత మేలు చేకూరాలంటే ప్రత్యేకంగా కంది బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ కేంద్రానికి విన్నవించారు. ఇప్పటివరకు బోర్డు ఏర్పాటుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8లక్షల ఎకరాలకు పైగా కంది పంటను సాగు చేస్తుండగా.. కేవలం వికారాబాద్ జిల్లాలోనే 1.80లక్షల ఎకరాలకు పైగా సాగు చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం కంది సాగు పెరుగుతూనే ఉన్నది. ఈసారి జిల్లావ్యాప్తంగా గత సంవత్సరం కంటే ఎక్కువగా కంది సాగు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు.
కంది బోర్డు ఏర్పాటు చేయాలి
– సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు రాములు
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా తాండూరు కంది రైతులు నష్టపోతున్నారు. ఎంపీ రంజిత్‌రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో కంది బోర్డు ప్రాధాన్యత గురించి ప్రస్తావించడంతోపాటు కంది బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు విన్నవించినా స్పందించలేదు.
నిర్లక్ష్యం వీడాలి
– మల్లేశ్వరి, చెంగోల్, తాండూరు
రైతులపై ఏ మాత్రం ప్రేమున్నా వెంటనే కంది బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలి. ఎంపీ విన్నవించినా కేంద్ర మంత్రులు ఈ విషయంపై స్పందించకపోవడం దురదృష్టం.