‘గోరింటా పూసింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేతా మొగ్గా తొడిగేలా..’ అన్నాడు ఓ సినీ కవి. మైదాకుతో ఎర్రగా పండిన అరచేతులు, పాదాలను చూసుకొని మురిసిపోని ఆడవారు ఉండరేమో! మైదాకు పెట్టుకోవడం వెనుక శాస్త్రీయ కోణంతోపాటు పరమార్థం కూడా ఉంది. మైదాకు సహజ సౌందర్యాన్నే కాక, ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుంది.
చేతులకు మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు. అందుకే మైదాకును ఇష్టపడని మగువలు ఉండరు. ఆషాఢ మాసంలో కొత్త పెళ్లికూతుర్లు కన్నవారింటికి వెళ్లిపోవడం, మైదాకుతో చేతులను అందంగా ముస్తాబు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. పండుగలు, పర్వదినాలు, శుభకార్యాల్లో మహిళలు మైదాకు పెట్టుకునేందుకు మక్కువ చూపుతారు. ఇది ఆచారంగానూ, సంస్కృతిలో భాగంగానూ భావిస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో మైదాకు పెట్టుకునేందుకు మహిళలు, యువతులు ఇష్టపడతారు. సహజ సౌందర్య సాధనమైన మైదాకుకు స్త్రీల అలంకరణ సాధనాల్లో ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో మహిళలు, యువతులు, చిన్న పిల్లలు మైదాకు పెట్టుకునేందుకు ఉత్సాహం చూపుతారు.
ఆషాఢ మాసంలో గ్రీష్మ రుతువు పూర్తయి, వర్ష రుతువు ప్రారంభమవుతుంది. ఈ రుతువులోని వేడికి మన శరీరం వేడిగా మారుతుంది. శ్రావణం ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లగా అవుతుంది. వాతావరణంలోని చల్లదనం, శరీరంలోని వేడితో అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మైదాకు పెట్టుకోవడం ద్వారా శరీరంలోని వేడి తగ్గి, ప్రకృతికి అనుకూలంగా శరీరం తయారవుతుంది. మైదాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాఢ మాసంలో మైదాకు కచ్చితంగా పెట్టుకోవాలనే సంప్రదాయాన్ని పూర్వీకులు తీసుకువచ్చినట్లు పెద్దలు చెబుతారు. పండుగలు పబ్బాల్లో మైదాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కాలానుగుణంగా, కోన్లు, పౌడర్ల వాడకం పెరుగుతున్నా.. అరచేతులే కాన్వాసుగా పరిమళభరితమైన చిత్రాల్ని ప్రకృతి సిద్ధంగా ఆవిష్కరించే మైదాకుకే మహిళలు పెద్దపీటవేస్తున్నారు. మందారంలా పండితే మంచి మొగుడొస్తాడు లాంటి సెంటిమెంట్ల మాటెలా ఉన్నా కొద్దిరోజులపాటు చేతులను కళాకృతులుగా మార్చుకునే ఈ ముచ్చట ఆషాఢ మాసంలో విరబూస్తుంది.
కోన్లతో నష్టమే..
ప్రస్తుతం మైదాకు స్థానంలో కోన్లు వచ్చిచేరాయి. రెడీమేడ్‌గా దొరికే ఈ మైదాకు అంత అందంగా, ఎర్రగా పండవు. పైగా నాసిరకం కోన్లతో చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మైదాకు చేతులకు ఎర్రగా ఉన్నన్ని రోజులు కోన్లు ఉండవు. అందుకే మైదాకే మేలు అని సూచిస్తున్నారు పెద్దలు.