పెద్దఅంబర్‌పేట, జూలై 16: ‘అమ్మా బైలెల్లినాదో నాయనా.. తల్లీ బైలెల్లినాదో.. లష్కర్లో బోనాలమ్మో మాయమ్మ ఘటమేలా మాంకాళమ్మా..’ కత్తులు బల్లెము చేతపట్టి.. దుష్టుల తలలు మాటలకట్టి నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మా..’ అంటూ లష్కర్ బోనాలతో మొదలై గ్రామాల్లో తల్లికి బోనమెత్తేదాకా ఊరూవాడా, పల్లెపట్నం బోనాలతో సందడిగా ఉంటుంది… పచ్చని తోరణాలతో ప్రతి ఇంటి గడప మెరుస్తుంది. పాటల మోతలతో ప్రతి గల్లీ దద్దరిల్లుతుంది.. పండుగ సంతోషాన్ని నింపడమే కాదు.. ఎన్నో మార్గాల్లో ఉపాధిని కూడా చూపుతుంది. ఎంతోమంది కడు పు నింపుతున్నది. బోనాలంటేనే బంధువుల సందడి. మబ్బుల లేచింది మొదలు.. రాత్రి ఊరేగింపుగా వెళ్లి అమ్మకు బోనమెక్కించే దాకా ఒకటే హడావిడి.
సమష్టిగా సంబురాల నిర్వహణ..
బోనాలంటే ఎన్నో పనులు. ఇంటి పనులను పక్కన పెట్టి యువకులంతా ఒక్కటవుతారు. ఊరంతా మాదే అనుకుంటారు. ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తలో పని చేస్తుంటారు. అందుకోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. రెండ్రోజుల ముందే సమావేశమవుతారు. ఏమేం పనులు ఉంటాయి..ఎవరెవరితో ఏయే పనులు చేయించాలి..పెద్ద మనుషులతో ఎలా మాట్లాడాలి..ఎంత ఖర్చవుతుంది.. దాతలెవరెవరు ఉంటారు ఇలా ఒక్కటేంటి అన్నీ పేపర్‌పై పెట్టేస్తారు. చందాలు రాగానే.. ఇక పనులన్నీ ఒక్కొక్కటిగా చక్కబెడతారు. పుంగీల మోత నుంచి బ్యాండులు, రన్నింగ్ డీజేల దాకా అన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం చేసేస్తారు. యువత అనుకుంటే ఔరా అనేలా చేస్తుందని ప్రశంసలు అందుకుంటారు.
పాటలతో మొదలై..
బోనాల పండుగ వస్తుందంటే చాలు ఊర్లో లేదా గల్లీల్లో పండుగకు రెండ్రోజుల ముందునుంచే పుంగీలతో పాటలు దద్దరిల్లిపోతాయి. పొద్దున లేచినకాడినుంచి రాత్రి పడుకునే వరకూ సందడిగా ఉంటుంది. ప్రధానంగా వినాయక చవితి తర్వాత బోనాల పండుగకే ఎక్కువ గిరాకీ ఉంటుందని సౌం డ్బాక్స్ల నిర్వాహకులు చెప్తున్నారు. రెండ్రోజుల ముందు నుంచే పుంగీలు బిగిస్తుంటామని పేర్కొంటున్నారు. ఆలయాలకు లైటింగ్ ఏర్పాటుతోపాటు పుంగీలను ఏర్పాటు చేస్తుంటామని అంటున్నారు. లైటింగ్, పుంగీలకు కలిపి రూ.10
వేల వరకు బిల్లు వేస్తామని చెప్తున్నారు. చిన్న, చిన్న ఆలయాల చుట్టూ లైటింగ్ వేయడంతోపాటు ఊర్లోని భక్తులు బోనాలతో అమ్మవారి ఆలయాల వద్దకు వచ్చే మార్గాల్లోనూ లైటింగ్ ఏర్పాటు చేస్తుంటామని పేర్కొంటున్నారు. వివిధ అమ్మవార్ల అలంకరణ, ఇతర ఆయుధాలు తదితర రూపాల్లో లైటింగ్‌లకు అయితే ఖర్చు ఎక్కువే ఉంటుందని, అయితే చాలాచోట్ల వీటికే ఎక్కువ డిమాండ్ ఉంటుందని పేర్కొంటున్నారు. బ్యాండ్లలో.. బేస్ బ్యాండ్ పియానోతో కలిపి రూ.60 వేల నుంచి 80 వేల వరకు ఉంటుంది. మొత్తం 18 మంది వరకు అందులో పాల్గొం టారు. మరోవైపు, రన్నింగ్ డీజేలకు రూ.25 వేల నుంచి 40 వేలు వరకు తీసుకుంటారు. ఇందులోనూ సౌండ్ వస్తుండగా పేపర్లు వర్షంలా పడటాన్ని పేపర్ షాట్ అంటారు. మరికొందరు స్మోక్ మెషిన్.. అంటే సౌండ్ వస్తుండగా పొగ వచ్చేలా ఏర్పాట్లు చేస్తుంటారు.
పూల అలంకరణ.. ప్రత్యేక ఆకర్షణ
బోనాల సంబురాల్లో ఆలయాల వద్ద పూల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. జగమేలు తల్లి నిలువెత్తు రూపం దర్శనమిస్తూ స్వాగతం పలికేలా ఆలయాల్లో నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుడి చిన్నగా ఉంటే తక్కువ పూలతో, పెద్దదైతే భారీ అలంకరణలతో ఆకట్టుకునేలా తీర్చి దిద్దుతున్నారు. వీధులు, గల్లీలను పూలతో అలంకరిస్తున్నారు. అలంకరణకు ఫీట్లను బట్టి రేటు ఉంటుందని పూల డిజైనర్లు చెప్తున్నారు.
12 ఏండ్లుగా ఉపాధి పొందుతున్నాం..
12 ఏండ్లుగా తొట్టెలు తయారు చేస్తున్నాం. బోనంతోపాటు తీసుకెళ్లే చిన్న తొట్టెల ధర రూ. 200 నుంచి రూ. 250 వరకు ఉంటుంది. కట్టె బొంగులతో వీటిని తయారుచేయాల్సి ఉంటుంది. బొంగులను చీల్చి పెట్టుకోవాలి. 25 ఫీట్ల తొట్టెలను తయారు చేసి, ఫినిషింగ్ ఇవ్వాలంటే కనీసం మూడ్రోజుల సమయం పడుతుంది. ఇందుకు ముగ్గురు పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం ఎనిమిది మందిమి ఇదే పని చేస్తాం. తొట్టెలపై వేసే డిజైన్‌ను బట్టి రేటు ఉంటుంది. తొట్టెలకు అమ్మవారు, పాము పడగలు, కులదైవాలు ఇలా ఎన్నో రకాలుగా ఆర్డర్లు వస్తుంటాయి. అందుకు తగ్గట్టుగా తయారుచేస్తాం. బోనాల పండుగకే గిరాకీ ఉంటుంది. అందుకే పండుగకు 500 వరకు తొట్టెలలను తయారుచేస్తాం. ఒక్కోటి సైజు, డిజైన్‌ను బట్టి రూ.15 వేల నుంచి 25 వేల వరకు కూడా ఉంటుంది. పని కూడా అలాగే ఉంటుంది. మాకు ముందస్తు ఆర్డర్లు వస్తుంటాయి.
– జొర్రీగల పురుషోత్తం, నారాయణగూడ
పూలతో అమ్మవారి రూపం
డిజైన్లను బట్టి పూల అలంకరణ రేట్లు ఉంటాయి. సాధారణంగా పూల తోరణాలు కడితే ఖర్చు తక్కువగా ఉంటుం ది. కానీ, అమ్మవారి రూపంలో డిజైన్లు కావాలంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. ముందుగా ఆర్డర్ ఇస్తేనే వాటిని ఆలయాల వద్దకు వెళ్లి సిద్ధం చేస్తాం. కనీసం నలుగురు పనిచేయాల్సి ఉంటుంది. 15 ఫీట్ల ఎత్తువరకు బంతి, చామంతి, ఇతర పూలతో అమ్మవారి రూపం కనిపించేలా అలంకరణ చేయాలంటే కనీసం రూ.50 వేల వరకు అవుతుంది. 15 ఫీట్ల ఎత్తు వరకు సిద్ధం చేయాలంటే దాదాపుగా క్వింటాల్‌కు పైగా పూలు అవసరం అవుతా యి. పూల అలంకరణలు రూ.15 వేల నుంచి 50 వేలకుపైగా కూడా ఉన్నాయి.
– కళాకార్ ప్రదీప్, పూల డిజైనర్, అంబర్‌పేట
తొట్టెలతో మొక్కు..
తొట్టెలు.. బోనాల పండుగలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. తొట్టెల కదులుతుందంటే చాలు పదుల సంఖ్యలో యువత ఆ చోటుకు చేరుతారు. చాలామంది ఇంట్లో నుంచి బోనం కుండతోపాటు చిన్న తొట్టెలను కూడా గుడివరకు తీసుకెళ్తారు. చిన్న తొట్టెల ఖరీదు రూ. 200 నుంచి 300 వరకు ఉంటుంది. గ్రామం, కాలనీల్లోని యువత ప్రత్యేకంగా తొట్టెలను తీస్తుంటారు. ముందుగానే ఆర్డర్ చేసి తొట్టెలను తీసుకొస్తారు. బ్యాండ్, డీజేల సౌండ్లతో ఆడుతూ పోతరాజులు వెంట వస్తుండగా తొట్టెలను ముందుకు తీసుకెళ్తారు. ఊరం తా చూస్తుండగా పండుగ వాతావరణంలో సందడిగా ఆల యం దగ్గరకు తీసుకెళ్లి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. తొట్టెలు ఎక్కువగా ఓల్డ్ సిటీలో లభిస్తుంటాయి. నగర శివారులో తక్కువగా దొరుకుతాయి. అందుకే చాలామంది వారం ముందే వెళ్లి తొట్టెలకు ఆర్డర్ ఇస్తుంటారు. వీటిలోనూ ఎన్నో డిజైన్లు ఉన్నాయి. డిజైన్‌ను బట్టి రేటు ఉంటుంది. అత్యధికంగా 20 ఫీట్ల తొట్టెల రూ.25 వేల వరకు ఉంటుంది.