రంగారెడ్డి, జూలై 15, (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్లో ఏర్పాటైన మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఆదిలోనే మెగా ప్రాజెక్టు దక్కింది. రూ.2100 కోట్ల వందే భారత్ మిషన్ కోచ్‌ల తయారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నది. ఇందులో మొత్తం75 కోచ్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. ఇప్పటికే 44 కోచ్‌ల తయారీకిగాను ఒప్పందం పూర్తికాగా, మరో 31 కోచ్‌ల తయారీకి ఒప్పంద ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. అంతేకాకుండా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉండగానే రూ.600 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకున్నది. కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే స్థానికంగా ఎంతోమందికి ఉపాధి దొరుకనున్నది. సుమారు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
దేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయిన రంగారెడ్డి జిల్లా కొండకల్‌లోని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రారంభంలోనే భారీ ప్రాజెక్టు దక్కింది. వందే భారత్ మిషన్ కోచ్‌ల తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్‌ను మేధా కోచ్ ఫ్యాక్టరీ దక్కించుకున్నది. వందే భారత్ మిషన్ కోచ్‌ల తయారీకి సంబంధించి మొత్తం 75 కోచ్‌ల తయారీకి కేంద్ర ప్రభుత్వంతో మేధా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికే రూ.2100 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించి 44 కోచ్‌ల తయారీకిగాను ఒప్పంద ప్రక్రియ పూర్తయ్యింది. మరో 31 కోచ్‌ల తయారీకి సంబంధించిన ఒప్పంద ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. వందే భారత్ మిషన్ కోచ్‌ల తయారీని జూన్ మొదటి వారంలో ప్రారంభించినట్లు మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సంస్థ ప్రతినిధి సుధాకర్ తెలిపారు. మరోవైపు కొండకల్‌లోని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తిని ప్రారంభించేందుకుగాను సిద్ధంగా ఉండగా, త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రపంచ స్థాయిలో ప్రైవేట్ కోచ్‌లను ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందనున్నది.
ఇప్పటికే రూ.600 కోట్ల ఆర్డర్..
మేధా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో ఉండగానే రూ.600 కోట్ల ఆర్డర్‌ను దక్కించుకున్నది. మోనో రైలు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఇప్పటికే 10 మోనో రైల్ రేక్స్ కోసం ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత సంస్థ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చినట్లయితే సుమారు 2 వేల మంది వరకు ఉపాధి లభించనున్నది. స్థానికంగా ఉన్న నిరుద్యోగులకూ ఉద్యోగాలు రానున్నాయి.
రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం కొండకల్లో నిర్మిస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ప్రారంభించేందుకుగాను అంతా సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నప్పటికీ కేంద్రం ఇప్పటికీ రాష్ర్టానికి మొండిచెయ్యే చూపుతూ వస్తున్నది. ప్రైవేట్ రైల్వే కోచ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన మేధా సంస్థను ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో భూములను కేటాయించింది. అదేవిధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ రైల్వే కోచ్‌తో దేశంలో ప్రైవేట్ రైల్వే కోచ్‌ల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థ ప్రైవేట్ రైల్వే కోచ్‌ను ఏర్పాటు చేయగా, సంబంధిత రైల్వే కోచ్‌లో మెట్రో, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్, రైళ్ల లోకోమోటివ్ బోగీలు, ప్యాసింజన్ కోచ్‌లను తయారు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాలో సీఆర్ఆర్సీ ఇండియా సంస్థ మెట్రో రైళ్లను తయారు చేస్తున్నది. సంబంధిత రెండు ప్రైవేట్ రైల్వే కోచ్‌లకు మించి అన్ని రకాల రైళ్ల కోచ్‌లను జిల్లాలోని మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారు. కొండకల్ మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో సాధారణ రైళ్లతోపాటు మోనో, మెట్రో, ఈఎంయూ, లోకోమోటివ్ రైళ్ల కోచ్‌లను తయారు చేయనున్నారు. దాదాపు రూ.1000 కోట్లతో నిర్మిస్తున్న కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఏడాదికి వెయ్యి బోగీలను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే ఉన్న రెండు ప్రైవేట్ రైల్వే కోచ్‌లకు మించి తయారు చేసేలా కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మించారు. అయితే రోజుగా 4-5 బోగీలను తయారు చేయనున్నారు.