పరిగి, జూలై 15 : వికారాబాద్ జిల్లాకు అవార్డుల పంట పండింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కాయకల్ప అవార్డులు ప్రకటించగా వికారాబాద్ జిల్లాకు పలు పురస్కారాలు లభించాయి. తాండూరులోని జిల్లా దవాఖాన 92శాతం స్కోర్‌తో రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా తాండూరు దవాఖానకు రూ.25లక్షలు ప్రోత్సాహకంగా అందనున్నది. అంతేకాకుండా ఏరియా దవాఖానల విభాగంలో వికారాబాద్ క్లస్టర్ హెల్త్ సెంటర్ 72.14శాతం స్కోర్‌తో 12వ స్థానంలో నిలువగా.. రూ.లక్ష నగదు పురస్కారం లభించనున్నది. కాయకల్ప క్వాలిఫైడ్ ఫెసిలిటీస్‌లో బొంరాస్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 75.30శాతంతో విజేతగా నిలువగా రూ.2 లక్షల నగదు అందనున్నది. కాయకల్ప అవార్డుల కింద జిల్లాకు మొత్తం రూ.31,85, 000 నిధులు సమకూరనున్నాయి.
2021-22 సంవత్సరానికిగాను ప్రభుత్వం కాయకల్ప అవార్డులు ప్రకటించగా వికారాబాద్ జిల్లాకు అవార్డుల పంట పండింది. జిల్లా దవాఖానలకు సంబంధించి తాండూరు జిల్లా దవాఖాన నిర్మల్ జిల్లా దవాఖానతో కలిసి 92 శాతం స్కోర్‌తో విజేతగా నిలిచింది. ఇందులో భాగంగా తాండూరు దవాఖానకు రూ.25లక్షలు అందనున్నాయి. ఏరియా దవాఖానల విభాగంలో వికారాబాద్ క్లస్టర్ హెల్త్ సెంటర్ 72.14 శాతం స్కోర్‌తో 12వ స్థానంలో నిలిచింది. దీంతో వికారాబాద్ సీహెచ్‌సీకి రూ.లక్ష క్యాష్ అవార్డు అందనున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి కాయకల్ప క్వాలిఫైడ్ ఫెసిలిటీస్‌లో వికారాబాద్ జిల్లాలో బొంరాస్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 75.30 శాతం స్కోర్‌తో విజేతగా నిలువగా, రూ.2లక్షలు క్యాష్ అవార్డు అందనున్నది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతం స్కోర్‌తో చిట్యాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 71.30 శాతం స్కోర్‌తో కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 71.3 శాతంతో పట్లూర్ పీహెచ్సీ, 72 శాతంతో అంగడిరాయచూర్ పీహెచ్‌సీలు నిలిచాయి. వీటికి ఒక్కో పీహెచ్‌సీకి రూ.50వేలు క్యాష్ అవార్డు అందనున్నది.
సబ్‌సెంటర్ల విభాగంలో వికారాబాద్ జిల్లాలో 76 శాతం స్కోర్‌తో ఎల్లకొండ సబ్ సెంటర్ విజేతగా నిలువగా రూ.లక్ష క్యాష్ అవార్డు అందుకోనున్నది. 75 శాతం స్కోర్‌తో గేట్‌వనంపల్లి సబ్ సెంటర్ మొదటి రన్నరప్‌గా, 74 శాతం స్కోర్‌తో ఐనాపూర్ సబ్ సెంటర్ రెండో రన్నరప్‌గా నిలిచాయి. కాయకల్ప అవార్డుల కింద వికారాబాద్ జిల్లాకు మొత్తం రూ.31,85,000 అందనున్నాయి. కాయకల్ప అవార్డు కింద వచ్చిన డబ్బుల్లో ఇన్సెంటివ్లుగా 25 శాతం, ఆసుపత్రులలో సదుపాయల కోసం 75శాతం ఖర్చు చేయనున్నారు. జిల్లా ఆసుపత్రులు, ఏరియా దవాఖానల్లో స్టాఫ్‌కు ఇచ్చే ఇన్సెంటివ్‌లు 25 శాతం డబ్బుల్లో 35 శాతం హౌస్‌కీపింగ్, సెక్యూరిటీ, గార్డెనింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్లకు, 25 శాతం నర్సింగ్ స్టాఫ్‌కు, 20 శాతం డాక్టర్లకు, 15 శాతం డబ్బులు పారా మెడికల్ స్టాఫ్‌కు, 5 శాతం మినిస్టీరియల్ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది.
మిగతా 75 శాతం నిధులు దవాఖానలో సదుపాయాల కల్పనకు వినియోగించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు సైతం విడుదల చేశారు. కాయకల్ప కార్యక్రమం కింద సంబంధిత దవాఖానల్లో పారిశుధ్యం, పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవలు, ఇన్ఫెక్షన్ కంట్రోల్‌తోపాటు అందించిన సేవలకు సంబంధించిన రికార్డులు పక్కాగా నిర్వహించడం వంటి వాటిని పరిశీలించి ఈ అవార్డులు ప్రకటించడం జరిగింది. ప్రతి దవాఖానకు నిత్యం ఎంతమంది రోగులు వస్తున్నారు, వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయి.. తదితర అంశాలను పరిశీలించి ఈ అవార్డులకు ఎంపిక చేశారు.
అవార్డులు రావడం సంతోషకరం..
తాండూరు జిల్లా దవాఖాన కాయకల్ప అవార్డుల్లో రాష్ట్రంలో నం.1 స్థానంలో నిలవడం సంతోషకరం. అవార్డు కింద రూ.25లక్షలు అందజేయనున్నారు. వికారాబాద్ సీహెచ్‌సీ సైతం క్వాలిఫయింగ్‌లో రూ.లక్ష అవార్డు దక్కింది. మరింత ఉత్తమ సేవలందేలా చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ ప్రదీప్‌కుమార్, డీసీహెచ్ఎస్, వికారాబాద్ జిల్లా