పెద్దేముల్, జులై 9 : రెండు మూడు రోజులుగా మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో కురిసిన వర్షానికి ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శనివారం మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామానికి చెందిన మోడె చిన్న రాములుకు చెందిన ఇంటి వెనుకభాగం పూర్తిగా తడిసి దెబ్బతిన్నది. జరిగిన నష్టానికి తనను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రాములు వేడుకొన్నారు.
మండలంలో ఎడతెరపిగా..
ధారూరు, జూలై 9 : ధారూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కురిసింది. దీంతో గ్రామాల్లోని రైతులు ఆనందం వ్వక్తం చేశారు. పంటపొలాల్లోనూ విత్తనాలు విత్తుకోవచ్చునని, వేసిన విత్తనాలకు కాస్త పదను అయిందని, పంట పొలాలను చదును చేసుకోవచ్చునని రైతులు పేర్కొన్నారు.
చెరువు, కుంటలకు జలకళ
తాండూరు రూరల్, జూలై 9 : మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాండూరు నియోజకవర్గంలోని చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షం నీరు చేరింది. చెక్డ్యాంలపై నుంచి వరద ప్రవాహం జోరుగా పారుతున్నది. తాండూరు కాగ్నా వాగులోని చెక్ డ్యాంతోపాటు మండల పరిధిలోని నారాయణపూర్ చెక్ డ్యాంపై నుంచి నీరు పారుతున్నది. అదేవిధంగా తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాల్లోని చెరువులు, కుంటల్లో వర్షం నీరు వచ్చి చేరింది. పంట పొలాల్లోకి నీరుచేరి పత్తి, కంది పంటలకు మేలు చేకూరుతుందన్నారు.
వానకాలంలో జాగ్రత్తలు పాటించాలి
మర్పల్లి, జూలై 9 : మూడు రోజులుగా ఎడతెరపిగా కురుస్తున్న వర్షాల పట్ల మండల ప్రజలు తగుజాగ్రత్తలు పాటించాలని మర్పల్లి ఎస్సై రాజేంద్రపసాద్ అన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం మండలంలోని కలఖోడా ఇబ్రహీం ఇల్లు, షాపూర్తండాలో గోబ్యా నాయక్ ఇంటి వెనుక భాగాలు తడిసి గోడలు కూలిపోయాయి. విషయం తెలుసున్న ఎస్సై రాజేంద్రపసాద్ షాపూర్ తండాకు వెళ్లి కూలిన ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి పాడుబడిన ఇండ్లల్లో నివసించకూడదని సూచించారు. విద్యుత్ స్తంభాలను తాకరాదని, ప్రజలు ఇంట్లో నుంచి అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు.
శిథిలావస్థ ఇండ్లలో ఉండరాదు..
కులకచర్ల, జూలై 9 : వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కులకచర్ల ఎస్ఐ గిరి అన్నారు. కులకచర్ల, చౌడాపూర్ మండలాల ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తమకు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇండ్లల్లో ఉండరాదని అన్నారు. ప్రజలు వర్షాల దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.