నవాబుపేట, జూన్ 25 : మండలంలోని 32 గ్రామపంచాయతీల్లోనూ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పించింది. దీనికి తోడు చిత్రాలతో కూడిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయగా, చిన్నారులకు అర్థమయ్యేలా చక్కని విద్యాబోధన అందుతున్నది. మండల పరిధిలో మొత్తం 45 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, 44 మెయిన్ సెంటర్లు, ఒక మినీ సెంటర్ ఉన్నది. మండలంలో రెండు సెక్టార్లు ఉండగా, అందులో ఒకటి నవాబుపేట, రెండోది ఏక్మామిడి. సొంత భవనాలు ఉన్న కేంద్రాలు 21, అద్దె భవనం 1, ఉచిత భవనాలు 23 ఉన్నాయి.
6 నెలల నుంచి 3 ఏండ్ల చిన్నారులు 1573, మూడు సంవత్సరాల నుంచి 5 ఏండ్ల చిన్నారులు 834, గర్భిణులు, బాలింతలు 585 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నాయి. చిన్నారులకు విద్యాబోధనతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. రక్తహీనత, బుద్ధిమాంద్యం వంటి సమస్యలను అధిగమించేందుకు పోషకాలతో కూడిన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. కేంద్రాలకు రాని చిన్నారులకు ఇంటి వద్దకే పోషకాహారాన్ని పంపిస్తున్నారు.
సామూహిక అక్షరాభ్యాసం..
ప్రస్తుతం ఈ నెల 20న అంగన్వాడీ టీచర్లు కేంద్రాల్లోనే చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అంగన్వాడీ సిబ్బందితో పాటు గ్రామ, మండల స్థాయి అధికారులనూ భాగస్వాములను చేశారు. అంతేకాకుండా చిన్నారులకు అర్థమయ్యేలా చిత్రాలతో కూడిన పుస్తకాలను అందజేయగా, చక్కని విద్యాబోధన అందిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా గోడలపై రంగురంగుల చిత్రాలనూ వేయించారు.
కంటికి రెప్పలా చూసుకుంటాం..
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులను కంటికి రెప్పలా చూసుకుంటాం. పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు అర్థమయ్యేలా విద్యాబోధన చేయిస్తున్నాం. సాయంత్రం స్నాక్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తాం. నెలకు ఒకసారి మీటింగ్ పెట్టి సమస్యలపై చర్చిస్తాం. ఎత్తు, బరువు, ఆరోగ్య సమస్యలు ఉన్న చిన్నారులను డాక్టర్లకు చూపించేలా తల్లిదండ్రులకు సూచనలు ఇస్తున్నాం.
– శాలినీ, నవాబుపేట మండల అంగన్వాడీ సూపర్వైజర్