శంకర్పల్లి, జూన్ 20 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు సమగ్రాభివృద్ధి సాధిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం రూ.57.14 కోట్లు విడుదల చేసిందన్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీకి ప్రతి నెలా రూ.14 లక్షల చొప్పున ఇప్పటివరకు రూ.3.69 కోట్లను మంజూరు చేసిందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో వసతుల కల్పనకు పెద్దపీట వేశామన్నారు. ‘పల్లె, పట్టణ ప్రగతి’తో పలు సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. ప్రతి ఊరు, పట్టణం పచ్చదనం, పరిశుభ్రతతో మెరుస్తున్నదన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి శంకర్పల్లి మున్సిపాలిటీపరిధిలో ఆర్అండ్బీ అతిథి గృహం ఆవరణలో రూ.2కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌కు పునాది వేశారు. బుల్కాపూర్ వార్డులో కోటి రూపాయలతో శ్మశానవాటికకు శంకుస్థాపన చేశారు. రూ.10కోట్ల నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో భూగర్భ మురుగునీటి కాలువలు, సీసీ రోడ్లు, వర్షపు నీటి కాలువలకు శంకుస్థాపన చేశారు. 11వ వార్డులో ఎంపీ నిధులు రూ.13.60 లక్షలతో వేసిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.57కోట్ల14లక్షలు విడుదల
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. శంకర్పల్లి మున్సిపాలిటీకి ప్రతి నెల రూ.14 లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేస్తున్నదని.. ఇప్పటివరకు రూ.3కోట్ల69లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలో మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.57కోట్ల14లక్షలు విడుదల చేశారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారాయని కొనియాడారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అయ్యారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని సూచించారు.
క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి..
చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలుపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని కొనియాడారు.
కేసీఆర్‌కు అండగా ఉండాలి..
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న ఏకైక మున్సిపాలిటీ శంకర్పల్లి అని.. నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ అయినప్పటికీ వేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రజల కోసం పరితపించే కేసీఆర్‌కు మనమంతా అండగా ఉండి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు, పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
అనంతరం బుల్కాపూర్ వార్డులో పాము కాటుకు గురై చనిపోయిన గౌండ్ల కుమార్‌గౌడ్ కుటుంబ సభ్యులను ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన ఇద్దరి పిల్లలకు స్థానిక ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు ఇప్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్, ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు శ్రీనాథ్‌గౌడ్, చంద్రమౌళి, అశోక్, సంతోశ్, శ్వేత, లక్ష్మమ్మ, రాధ, లావణ్య, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, శ్రీధర్, మాజీ చైర్మన్ రాజునాయక్, సర్పంచ్‌లు రవీందర్‌గౌడ్, శ్రీనివాస్, సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, ప్రవీణ్, మండల, పట్టణ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్‌కన్నా, మండల, పట్టణ యూత్ అధ్యక్షులు పాండురంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, బాలకృష్ణ పాల్గొన్నారు.