రంగారెడ్డి, జూన్ 19, (నమస్తే తెలంగాణ) : గ్రామీణ యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకుగాను సీఎం కేసీఆర్ నిర్ణయించిన తెలంగాణ క్రీడా మైదానాల ఏర్పాటు ప్రక్రియ రంగారెడ్డి జిల్లాలో వేగంగా జరుగుతున్నది. ఈ నెల మొదటి వారంలోనే 54 క్రీడా ప్రాంగణాలను ప్రారంభించగా, త్వరలోనే మిగతా అన్ని క్రీడా ప్రాంగణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 863 క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 558 గ్రామపంచాయతీలతోపాటు 305 ఆవాస ప్రాంతాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే 638 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంబంధించి స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తికాగా, మిగతా గ్రామాల్లో వారంలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి క్రీడా ప్రాంగణాన్ని ఎకరా స్థలంలో ఏర్పాటు చేస్తున్నారు.
వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, లాంగ్జంప్నకు సంబంధించి క్రీడలు ఆడేలా మైదానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో క్రీడా మైదానం ఏర్పాటుకు రూ.4 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మరోవైపు క్రీడా మైదానాల్లో పచ్చదనం వెల్లివిరిసేలా మైదానం బౌండ్రీ చుట్టూ మొక్కలను నాటుతున్నారు. ఆటస్థలం చుట్టూ 300 మొక్కలను నాటుతున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో సిద్ధంగా ఉన్న మొక్కలను క్రీడా మైదానాలకు బౌండ్రీల్లో నిమ్మ, బాదం, గుల్మొహర్, కానుగ, తంగేడు, చింత, వెదురు మొక్కలను నాటుతున్నారు. నాటిన మొక్కలు బతికేలా ఏడాదిలో 30 సార్లు నీటిని మొక్కలకు అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. క్రీడా మైదానాల ఏర్పాటు నిర్వహణకు ప్రతి మండలానికీ ఒక ప్రత్యేకాధికారిని కూడా ఇప్పటికే కలెక్టర్ నియమించారు.
ఇప్పటివరకు 266 టీకేపీలు పూర్తి
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 266 క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకుగాను స్థలాల గుర్తింపు ప్రక్రియ తుది దశకు చేరిన దృష్ట్యా వీలైనంత త్వరగా మిగతా తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా జిల్లావ్యాప్తంగా నిర్ణయించిన 863 క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలను ముమ్మరం చేస్తున్నది.
ఇప్పటివరకు పూర్తైన తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో అత్యధికంగా ఫరూఖ్‌నగర్ మండలంలో 34, యాచారంలో 26, శంకర్‌పల్లిలో 24, షాబాద్‌లో 23, మహేశ్వరంలో 21, చౌదరిగూడెంలో 17, శంషాబాద్‌లో 16, కొందుర్గులో 14, కడ్తాల్, కందుకూరు, నందిగామలో 11, కేశంపేటలో 10, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 8, ఆమనగల్లులో 7, తలకొండపల్లి, మొయినాబాద్, మాడ్గులలో 6, మంచాలలో 5, ఇబ్రహీంపట్నం, కొత్తూరుల్లో 4, చేవెళ్ల మండలంలో రెండు తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ నెలాఖరులోగా పూర్తికి చర్యలు : నీరజ, డీఆర్డీఏ ఏపీడీ
తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. స్థలాల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది, ఈ నెలాఖరులోగా జిల్లాలో నిర్దేశించిన క్రీడా ప్రాంగణాలన్నింటినీ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం.