ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 16 : రుతు పవనాల రాకతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం నుంచి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. తొలకరి పలకరింపుతో అన్నదాతలు పొలం బాట పట్టారు. ఇప్పటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై దుక్కులను సిద్ధం చేసుకుంటున్న రైతులు వర్షాలు కురుస్తుండటంతో పంటలను సాగుచేసుకునేందుకు విత్తనాల కొనుగోళ్లు, పొలాలను సిద్ధం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. నిన్న మొన్నటి వరకు భానుడి భగభగకు ఇబ్బంది పడిన ప్రజలు వరుణదేవుడు కరుణించటంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. రైతులు తమ వ్యవసాయ పొలాల్లో పంటలు వేసుకోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నందున రైతులకు కావాల్సిన అన్ని రకాల విత్తనాలను వ్యవసాయాధికారులు అందుబాటులో ఉంచారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సహకార సంఘాలతో పాటు డీసీఎంఎస్‌లలో విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు. సబ్సిడీ ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు.
దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగానే రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం వలన ఇప్పటికే రైతులు అవసరమైన విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు మొక్కజొన్న, పత్తి, కందులతో పాటు ఇతర రకాల విత్తనాలను పెద్ద ఎత్తున వేసుకుంటున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు ఈ నెలాఖరు నాటికి పెసర్లు, మొక్కజొన్నలు వేసుకోవచ్చునని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరినార్లను కూడా ఈనెలాఖరు లోపు వేసుకుంటే అధిక దిగుబడులు వచ్చే అవకాశముందని అన్నారు. అలాగే, వచ్చే నెల 15 నాటికి పత్తివిత్తనాలు వేసుకోవాలని, అలాగే, జూలై 31వరకు కందులు వేసుకోవాలని సూచించారు. ఆముదం పంటను ఆగస్టు 15వరకు వేసుకుంటే అధిక దిగుబడులు వచ్చే అవకాశముందని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయశాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులను పొందాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వరితో పాటు మెట్టపంటలు మొక్కజొన్న, పత్తి, ఆముదం, కందులు రైతులు అధికంగా వేస్తున్నందున నిర్ణీత గడువులోపల విత్తనాలు వేసుకుంటే అధిక దిగుబడులు వచ్చే అవకాశముందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే చర్యలు
రైతులు గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారస్తులు విక్రయించే విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దు. నాసిరకం విత్తనాలు కొనుగోలు చేస్తే దిగుబడి గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. నాసిరకం విత్తనాలు విక్రయించే వారి సమాచారం అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు ప్రభుత్వం గుర్తించిన ఐఎస్ఐ మార్కు ఉన్న విత్తనాలను కొనుగోలు చేసి అధిక దిగుబడులను పొందాలి. అలాగే, ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ విత్తనాలు కొనుగోలు చేయటం మంచిది. – వరప్రసాద్‌రెడ్డి, ఏవో ఇబ్రహీంపట్నం