కడ్తాల్, జూన్ 15 : ఆమనగల్లును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆమనగల్లు అభివృద్ధికి బుధవారం హైదరాబాద్‌లోని ప్రజారోగ్య సాంకేతిక శాఖ ఎస్ఈ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో సంబంధిత ఎస్ఈ, ఈఈలతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకంలో రూ.32 కోట్లు మంజూరుతోపాటు, టీయూఎఫ్ఏడీసీ పథకంలో ఆమనగల్లు పట్టణానికి మంజూరైన రూ.15కోట్లతో చేపట్టే పనుల గురించి అధికారులతో చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మున్సిపల్లో చేపట్టాల్సిన సీసీ రోడ్లు, పబ్లిక్ పార్కు, క్రీడా స్థలం, సురసముద్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయా పనులకు డీపీఆర్‌ను సిద్ధం చేసి టెండర్లు పిలువాలని, వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈలు వెంకటేశ్వర్లు, రమణమూర్తి, ఈఈ ప్రభాకర్‌రెడ్డి, డీఈఈ యాదయ్య, ఏఈఈ భార్గవ్ పాల్గొన్నారు.