కొత్తూరు, జూన్ 15 : విశ్వసనీయ సమాచారం మేరకు కల్తీ నూనెను విక్రయిస్తున్న దుకాణంపై మున్సిపల్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి చేసి కల్తీనూనెను సీజ్ చేసిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటీలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామకు చెందిన వ్యాపారి సురేశ్‌గుప్తా కొత్తూరులోని మహదేవ్ ఏజెన్సీలో మంచినూనెను కొని నందిగామలో విక్రయించాడు. నూనెను తీసుకెళ్లిన వినియోగదారుడు వంటలకు ఉపయోగించడంతో నురుగు రావడం ప్రారంభమైంది. ఇది కల్తీ నూనె అని గ్రహించి తిరిగి సురేశ్గుప్తాకు అప్పగించాడు. దీంతో సురేశ్‌గుప్తా దాన్ని మహదేశ్ ఏజెన్సీకి తిరిగి తెచ్చాడు. ఈ సందర్భంగా మహదేవ్ ఏజెన్సీ వారికి.. సురేశ్ గుప్తాకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోలు సోషలఖ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో కొత్తూరు మున్సిపల్ కమిషనర్ వీరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తూరు సీఐ బాలరాజు వెంటనే స్పందించి మహదేవ్ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న మంచినూనె డబ్బాలను సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నూనెను విక్రయిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.