రంగారెడ్డి, జూన్ 15, (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉండేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో తీసుకొచ్చిన టీఎస్-బీపాస్ విధానంతో ప్రజలకు పారదర్శక సేవలందుతున్నాయి. ముఖ్యంగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఆదా చేసే సదుద్దేశంతోనే టీఎస్ బీ-పాస్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో మాదిరిగా భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే ప్లానర్ దగ్గర నుంచి టౌన్ ప్లానింగ్ అధికారుల వరకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉండేది. అనుమతులకు సంబంధించి అన్ని సరిగ్గా ఉన్నప్పటికీ ఏదో ఒక కొర్రీలు పెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేవారు.
అంతేకాకుండా భవన నిర్మాణ అనుమతులకై దరఖాస్తు చేసుకున్నప్పటికీ రెండు, మూడు నెలలకు అనుమతులను మంజూరు చేసేవారు. మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభాగంలో అంతా అవినీతిమయం కావడంతో లంచమిస్తేనే అనుమతులిచ్చే పరిస్థితి ఉండడంతో భవన నిర్మాణ అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధం లేకుండా, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఇండ్ల నిర్మాణ అనుమతులిచ్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీ-పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. భవన నిర్మాణ అనుమతుల్లో ప్లానర్స్ ప్రమేయం లేకుండా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చారు.
అయితే టీఎస్-బీపాస్ ద్వారా ఇండ్ల నిర్మాణ అనుమతులేకాకుండా లే అవుట్లకు సంబంధించిన అనుమతులనూ టీఎస్-బీపాస్ ద్వారానే జారీ చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల అనుమతులంతా ఆన్లైన్ కావడంతో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక సేవలందుతున్నాయి. జిల్లాలోని 12 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్ల ద్వారా ఇప్పటివరకు 500 చదరపు గజాల్లోపు భవన నిర్మాణాలకుగాను 11,327 దరఖాస్తులకు అనుమతులు, 500 గజాలపైన 471 దరఖాస్తులకు, 6 లే అవుట్లకు సంబంధించి అనుమతులను సంబంధిత అధికారులు జారీ చేశారు.
దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు..
భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియ చాలా సులువుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన టీఎస్-బీపాస్‌తో దరఖాస్తు చేసుకున్న తక్షణమే అనుమతులు మంజూరవుతున్నాయి. భవన నిర్మాణానికి కావాల్సిన అన్ని పత్రాలను ఆన్లైన్లో పొందుపర్చి దరఖాస్తు చేసుకుంటే చాలా క్షణాల్లో స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్ సర్టిఫికెట్) పత్రం జారీ అవుతున్నది. సంబంధిత స్వీయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా భవన నిర్మాణాన్ని చేపడుతున్నారు. అయితే గతంలోనూ భవన నిర్మాణ అనుమతులు ఆన్లైన్ విధానంలోనే జారీ అయినప్పటికీ ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న అనంతరం 21 రోజుల్లో అనుమతులివ్వాలని నిబంధనలున్నా,..
మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరమే అనుమతులు జారీ చేసేవారు. టీఎస్-బీపాస్ నిబంధనల ప్రకారం 75 చదరపు గజాల్లోపు స్థలంలో నిర్మించే భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కేవలం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి నామమాత్రంగా ఒక్క రూపాయిని చెల్లించి అనుమతులు పొందుతున్నారు. 75 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు గల స్థలంలో భవన నిర్మాణాలు చేపట్టే వారు బిల్డింగ్ ప్లాన్‌ను టీఎస్-బీపాస్ వెబ్సైట్లో పొందుపర్చిన వెంటనే ఆన్లైన్ ద్వారా అనుమతులు మంజూరవుతున్నాయి.
అదేవిధంగా 500 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలోని ప్లాట్లలో నిర్మించే భవన నిర్మాణాలకు సింగిల్ విండో విధానం ద్వారా 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా అగ్నిమాపక, నీటి పారుదల తదితర శాఖలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా టీఎస్-బీపాస్‌లో దరఖాస్తు చేసుకుంటే చాలు ఒకేచోట అన్ని అనుమతులు జారీ అవుతున్నాయి. అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా ఉండి దరఖాస్తు చేసుకున్నా 21 రోజుల్లో అనుమతి రానట్లయితే 22వ రోజున అనుమతిచ్చినట్లుగా సమాచారం సదరు భవన నిర్మాణదారుడికి నేరుగా అన్లైన్ ద్వారా మెస్సేజ్ వెళ్లేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వాస్తవాలను తప్పుగా ఆన్లైన్లో పొందుపర్చినట్లయితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.