కొడంగల్, జూన్ 15 : మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు కలెక్టర్ నిఖిల తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశపు హాల్లో మంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టే ప్రాంతాల్లో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి పనులను పూర్తి చేయించాలన్నారు.
డిగ్రీ కళాశాల, 50 పడకల దవాఖాన భవనం, పార్క్, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్, మున్సిపల్ పరిధిలోని సీసీ రోడ్ల ప్రారంభోత్సం చేపట్టనున్నారని, ఈ ప్రాంతాల్లో కేటాయించబడ్డ అధికారులు దగ్గర ఉండి ఏర్పాట్లను పూర్తి చేయించాలన్నారు. మున్సిపల్ కార్యాలయ భవనం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వైకుఠధామంతో పాటు రూ.10కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి శిలాఫలకాల ఏర్పాటు తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సభాప్రాంగణంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఉదయం 9 గంటల తరువాత కార్యాక్రమాలు ప్రారంభం కానున్నాయని, అధికారులు అందుబాటులో ఉండి ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి, ఆర్డీవో అశోక్‌కుమార్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి కోఠాజీ, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఆయా శాఖల ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.
నేడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు
పరిగి, జూన్ 15 ః పరిగిలో కోటి రూపాయలతో నిర్మాణం చేపట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గురువారం మంత్రి టీ.హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 9 గంటలకు పరిగిలోని 50 పడకల దవాఖానను మంత్రి సందర్శిస్తారు. 9.30 గంటలకు పరిగి పట్టణంలోని శారద గార్డెన్-2లో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో మంత్రి స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తారు.
చౌదర్పల్లిలో..
బొంరాస్‌పేట, జూన్ 15 : మండలానికి గురువారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రానున్నట్లు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి తెలిపారు. చౌదర్పల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించే ముదిరాజ్ భవన్‌కు శంకుస్థాపన, అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మంత్రులు పాల్గొంటారని వారు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరై మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.