ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 6 : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రైతాంగ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన రైతు అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రంగోలి, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సొంతంగా నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా విద్యార్థులు తీర్చిదిద్దిన రైతుబంధుకు సంబంధించిన ముగ్గులను ఎమ్మెల్యే తిలకించి ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, వైస్‌ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి, వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ, ఎంపీడీవో మహేశ్‌బాబు, కౌన్సిలర్ నల్లబోలు మమత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
రైతు సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యం
తుర్కయాంజాల్ : ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసే రైతుల పాలిట రైతు బంధు పథకం వరంలాంటిదని రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. రైతు బంధు సంబురాల్లో భాగంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి కొహెడ, తొర్రూర్ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు, రైతు బంధు ప్రతినిధుల ఆధ్వర్యంలో గురువారం ఎండ్ల బండ్లు, ట్రాక్టర్లతో కలిసి రైతులు ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశ పెట్టాక 8 విడుతల్లో కలిసి మొత్తం రూ.50 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుల ఖాతాల్లో వేసినట్లు గుర్తు చేశారు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టే సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతి కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు. నల్లా చట్టాల పై సీఎం కేసీఆర్ చేసిన పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సిద్దాల్ల జ్యోతీజంగయ్య, అబ్దుల్లాపూర్‌మెట్ మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కందాల బలదేవరెడ్డి, కౌన్సిలర్ సిద్ధాల్ల జ్యోతి, వ్యవసాయ అధికారి కల్యాణి , నాయకులు సామ శ్రీనివాస్ రెడ్డి, బుడ్డ విజయ్‌బాబు, మాజీ ఎంపీటీసీ యాదయ్య పాల్గొన్నారు.
రైతుబంధుతో వెల్లివిరుస్తున్న ఆనందం
ఆమనగల్లు : వ్యవసాయాన్ని పండుగ చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నిట్ట నారాయణ అన్నారు. మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏవో అరుణకుమారి ఆధ్వర్యంలో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
ఘనంగా రైతుబంధు సంబురాలు
యాచారం : మండలంలో రైతుబంధు సంబురాలు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చౌదరపల్లిలో జరిగాయి. జై కేసీఆర్ అని వరి ధాన్యంతో రాసి ప్రదర్శించారు. రైతుబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఉన్నారు.
విద్యార్థులకు పోటీలు
తలకొండపల్లి : చుక్కాపూర్ గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టులతో రైతులకు మేలు అనే అంశాలపై డ్రాయింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చెర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని, రైతుబంధు పథకంతో అన్నదాతలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారని జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. రైతుబంధు వారోత్సవాలలో భాగంగా మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో , సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరయ్య, జిల్లా సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ఏడీఏ సుజాత, ఏవో శ్రీలత, ఏఈవో స్వాతి, సర్పంచ్ యాదయ్య, ఉప సర్పంచ్ రామకృష్ణ పాల్గొన్నారు.
తుర్కగూడ పాఠశాలలో ..
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిధిలోని తుర్కగూడ ప్రాథమిక పాఠశాలలో రైతుబంధు సంబురాలు ఘనంగా జరిగింది. పాఠశాల ఆవరణలో రైతుబంధుకు సంబంధించిన ముగ్గులను వేయించారు. జై కేసీఆర్, జై రైతుబంధు చిత్రాలను రకరకాల రంగులతో తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఏనుగు భరత్‌రెడ్డి, సర్పంచ్ కత్తుల పవిత్ర, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఏనుగు బుచ్చిరెడ్డి, రైతుబంధు కో ఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు వెంకటేశ్‌గౌడ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సూరి పాల్గొన్నారు.