ఇబ్రహీంపట్నం/కొడంగల్, జూన్ 12 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడిలో భాగంగా శుభ్రం చేయించారు. బడీడు పిల్లలు బడిలోనే ఉండాలని.. చదువు మధ్యలో మానేసిన వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులను కల్పించారు. జిల్లా పరిషత్ నిధుల నుంచి పలు పాఠశాలలకు నూతనంగా ఆటవస్తువులను కూడా అందజేశారు. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో సిద్ధంగా ఉంచారు. ఈ ఆటవస్తువులు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు సైతం మన ఊరు మన బడి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు పెద్దఎత్తున అడ్మిషన్లను ఇప్పించడానికి ముందుకు వచ్చారు.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు పలువురు దాతల సహాయాన్ని కూడా తీసుకున్నారు. దాతల సహకారంతో పాఠశాలలో బెంచీలు, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాలలకు రంగులు వేయటంతో పాటు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వాల్ పెయింటింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటగదుల నిర్మాణం కూడా చేపట్టారు. ఇప్పటికే ఆటవస్తువులను ప్రభుత్వ పాఠశాలల్లో అమర్చి సిద్ధంగా ఉంచారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే కార్యక్రమం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే బడీడు వచ్చి పాఠశాలలకు రాని పిల్లలను, పాఠశాలలకు వచ్చి మధ్యలో మానేసినవారిని కూడా గుర్తించి సోమవారం నుంచి పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం చేపట్టనున్నారు.
అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం.
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఇందుకు సంబంధించి బియ్యం, ఇతరత్రా సరుకులు పాఠశాలలకు చేరుకున్నాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించి అన్ని పాఠశాలల్లో వంటగదులు, తాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1050 పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా మధ్యాహ్న భోజనాన్ని కూడా సోమవారం నుంచి అందుబాటులోకి తేనున్నారు. బీద విద్యార్థులు అభ్యసించే దిశగా ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. దీంతో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరుగనున్నట్లు ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. ఇదివరకే ఉపాధ్యాయులు వారివారి పరిధిలోని గ్రామాల్లో ఇంటింకీ సర్వే నిర్వహించి ఆంగ్ల మాధ్యమంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.
వికారాబాద్ జిల్లా పరిధిలోని 764 ప్రాథమిక పాఠశాలల్లో 43,364, 116 యూపీఎస్ పాఠశాలల్లో 12,210, 174 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 36,324, 9 టీఎస్ఎంఎస్ పాఠశాలలల్లో 5,286, 18 కేజీబీవీఎస్ పాఠశాలల్లో 4.386, 26 తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 9,269 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమం కింద 371 పాఠశాలలను ఎంపిక చేశారు.
పది రోజుల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు
నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో మరో పది రోజుల్లో అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అందజేస్తాం. ఇప్పటికే జిల్లాకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే ఆయా మండల విద్యాధికారులకు.. అనంతరం పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను చేరవేసే కార్యక్రమాన్ని చేపడుతాం. విద్యార్థులందరికీ యూనిఫాంలను కూడా త్వరలోనే అందజేస్తాం. – సుశీందర్రావు, రంగారెడ్డి డీఈవో