మంచాల, జూన్ 12 : ఎన్నో ఏండ్లుగా వర్షపు నీరు వృథాగా పోవడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది. రెండుకొండల మధ్య నుంచి వచ్చే వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు గతంలో కాంగ్రెస్, టీడీపీలు చెక్‌డ్యాం నిర్మాణానికి పూనుకున్నా నిధులు మంజూరు చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసువెళ్లిన వెంటనే రూ.3.9కోట్లను మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న బీడుభూములు త్వరలో సాగులోకి రావడమే కాకుండా సస్యశ్యామలంగా మారనున్నది.
మంచాల మండలం ఎల్లమ్మతండా గ్రామ సమీపంలో గాడివంపువాగు చెక్‌డ్యాం నిర్మాణం కోసం గత సీమాంధ్ర పాలనలో ముంపునకు గురయ్యే రైతులకు తగిన నష్టపరిహారం ఇవ్వకుండానే రూ.1.5కోట్లను కేటాయించారు. అయితే, ముంపునకు గురయ్యే రైతులకు తగిన నష్టపరిహారం ఇచ్చేవరకు పనులు ముందుకు సాగకపోవడంతో చెక్‌డ్యాం నిర్మాణం కోసం కేటాయించిన నిధులు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకే చేరాయి. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో ఏనాడు కూడా గాడివంపువాగు చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టాలనే ఆలోచన లేకుండా పోయింది. నిధులు కేటాయించడమే కాని, భూ సర్వే కాని, ముంపునకు గురయ్యే రైతులు ఎంత మంది ఉన్నారనే వివరాలు కూడా సేకరించిన దాఖలాలు లేవు. దీంతో సీమాంధ్ర పాలనలో వేసిన శిలాఫలకాలకే పరిమితమైంది.
చెక్‌డ్యాం నిర్మాణానికి రూ.3.9కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లమ్మతండా గ్రామసమీపంలో ఉన్న గాడివంపువాగు నిర్మాణం కోసం రూ.3.9 కోట్లను కేటాయించింది. గత 20 ఏండ్ల నుంచి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టేందుకు, రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన గాడివంపువాగు చెక్‌డ్యాం నిర్మాణానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో రైతుల ఆనందానికి అవదుల్లేవు. ఎల్లమ్మతండా నుంచి లోయపల్లి వరకు సుమారు 500 పైచిలుకు ఎకరాల బీడు భూములు సాగులోకి రానున్నాయి. గాడివంపు వాగు నిర్మాణం చేపడితే ఈ ప్రాంతం భూములు సస్యశ్యామలంగా మారడమే కాకుండా భూగర్భ జలాలు కూడా పైకివచ్చి ఈ ప్రాంతం ఎప్పుడు నీటితో కళకళలాడుతాయి.
ఎత్తైన రెండు కొండల మధ్య నుంచి వచ్చే నీటిని ఒడిసిపట్టేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువైనదిగా ఉందని, ఇక్కడ చెక్‌డ్యాం నిర్మిస్తే రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని నిర్ణయించారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు, తహసీల్దార్ దేవూజా, సర్వేయర్ ఈ ప్రాంతంలో పర్యటించి ముంపునకు గురయ్యే రైతుల వివరాలతోపాటు ఎన్ని ఎకరాలు భూమి గాడివంపువాగులో కోల్పోతున్నారనే విషయంపై పూర్తి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడమే కాకుండా భూమి నష్టపోతున్న రైతులకు ఎకరానికి రూ.10లక్షల చొప్పున అందజేశారు.
ఎకరాకు రూ.10లక్షలు నష్టపరిహారం
ఎల్లమ్మతండా సమీపంలో నిర్మిస్తున్న గాడివంపువాగు చెక్‌డ్యాంకు సంబంధించిన ప్రాంతంలో 18ఎకరాల భూమి ముంపునకు గురవుతున్నది. అందులో 14మంది రైతులున్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా నష్టపోవద్దన్న సదుద్దేశంతో పట్టాభూమికి ఎకరానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వగా, అసైన్డ్‌మెంట్ భూమికి ఎకరానికి రూ.8లక్షల చొప్పున ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందజేసింది. దీంతో రైతులు కూడా గాడివంపువాగు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తున్నారు. గాడివంపువాగు నిర్మాణం పూర్తయితే ఎల్లమ్మతండాతోపాటు బోడకొండ, ఆంబోతుతండా, సత్తితండా, లోయపల్లితో పాటు తదితర తండాలకు మేలు జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి.
సాగునీరు తేవడమే లక్ష్యం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు శివన్నగూడ ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీటిని తీసుకువచ్చి ఈ ప్రాంతలోని చెరువులు, కుంటలను నింపడంతోపాటు ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం. అందులో భాగంగానే మంచాల మండలం ఎల్లమ్మతండా సమీపంలోని గాడివంపువాగు కింద పంటలను సాగు చేసుకునేందుకు చెక్‌డ్యాంను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.3.9 కోట్లను మంజూరు చేయించాం. త్వరలో పనులను ప్రారంభించనున్నాం.
–మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే
ఎమ్మెల్యే కృషి మరువలేనిది
గాడివంపువాగు నిర్మాణానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదనిది. ఎల్లమ్మతండా సమీపంలో గాడివంపువాగు నిర్మాణానికి గత పాలకులు ఎన్నో హామీలిచ్చి తుంగలో తొక్కారని, నేడు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గాడివంపువాగు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడమే కాకుండా భూమి నష్టపోతున్న రైతులకు కూడా రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసి వారికి అండగా నిలిచారు. చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభమైతే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారనున్నది.
– జాటోతు నర్మద, ఎంపీపీ